ఈ రోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ మారిటైమ్ పాలసీ, టెక్స్ టైల్స్ గార్మెంట్ పాలసీ, ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ (4.0)లకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతోపాటు, పులివెందుల, ఉద్ధానం, డోన్ తాగునీటి ప్రాజెక్టులను ఆమోదించింది. హోమియోపతి, ఆయుర్వేద ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలు, ఇంటిగ్రేటెడ్ టూరిజం పాలసీ, క్రీడా విధానంలో మార్పులకు ఆమోదం లభించింది.
రేషన్ బియ్యం అక్రమ రవాణా అంశంపై మంత్రులతో చంద్రబాబు చర్చించారు. ప్రభుత్వానికి ఈ మాఫియా సవాల్ గా మారిందని, అడ్డుకట్ట వేస్తామని చంద్రబాబు చెప్పారు. కాకినాడ పోర్టులో అరబిందో సంస్థ 41 శాతం వాటాను లాగేసుకుందని, ఆస్తులు గుంజుకోవడం వైసీపీ హయాంలో ట్రెండ్ గా మారిందని వ్యాఖ్యానించారు. జల్ జీవన్ మిషన్ పథకం ఇంకా డీపీఆర్ స్థాయిని దాటకపోవడంపై చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ అసహనం వ్యక్తం చేశారు.