స్టార్ షట్లర్ పీవీ సింధు కు వివాహం నిశ్చియమైంది. ఈ నెల 22న ఒక వ్యాపారవేత్తను ఆమెను పెళ్లాడనుంది. వీరి పెళ్లి రాజస్థాన్ లోని ఉదయపూర్ లో జరగనుంది. ఈ వివాహ రిసెప్షన్ ఈ నెల 24న హైదరాబాద్ లో జరగనుంది. పెళ్లి కార్యక్రమాలు ఈ నెల ఇరవై నుంచి మొదలు కానున్నాయి. ఇంతకూ వరుడు ఎవరంటే.. యువ వ్యాపారవేత్త గౌరవెల్లి వెంకట దత్త సాయి.
బెంగళూరు ట్రిపుల్ ఐటీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన దత్త.. హైదరాబాద్ కు చెందిన పోసిడెక్స్ టెక్నాలజీస్ కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. అతడి తండ్రి బీటీ వెంకటేశ్వరరావు అదే కంపెనీకి ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఇక.. సింధు విషయానికి వస్తే.. షట్లర్ గా ఫేమస్ కావటమే కాదు.. ఏపీలో డిప్యూటీ కలెక్టర్ గా పని చేస్తున్నారు. వీరిద్దరి మధ్య పరిచయం ఏడాదిగా ఉందని చెబుతున్నారు.
గత నెలలోనే వీరి పెళ్లికి సంబంధించి ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా పీవీ సింధు తండ్రి పీవీ రమణ వెల్లడించారు. వచ్చే జనవరి నుంచి ఆమె వరుస టోర్నీలో ఆడాల్సి ఉండటం.. ఖాళీ లేకపోవటంతో డిసెంబరులో పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇరు కుటుంబాలు భావించాయి. 2013లో వరల్డ్ చాంపియన్ షిప్ పతకంతో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న సింధు.. 2019లోనూ ప్రపంచ చాంపియన్ షిప్ ను సొంతం చేసుకోవటం తెలిసిందే.
2016లో ఒలింపిక్స్ లో రజత పతకాన్ని సాధించిన ఆమె.. 2021 టోక్యో క్రీడల్లో కాంస్య పతకాన్ని దక్కించుకుంది. మొత్తంగా రెండు సార్లు ఒలింపిక్స్ పతకాన్ని సాధించిన ఏకైన భారతీయ క్రీడాకారిణిగా ఆమె రికార్డును క్రియేట్ చేశారు. 2028 ఒలింపిక్స్ వరకు కెరీర్ లో కొనసాగాలన్నది సింధు ఆలోచనగా చెబుతారు. ఇక.. ఈ యువ జంట గడిచిన కొంతకాలంగా కొన్ని కార్యక్రమాలకు.. సినిమాలకు కలిసి వెళ్లటం చేసినా.. ఆ విషయాలేవీ వార్తలుగా రాలేదు. తాజాగా సింధు కుటుంబం పెళ్లి వివరాల్ని వెల్లడించటంలో విషయం బయటకు వచ్చింది. పెళ్లి పీటల మీదకు ఎక్కనున్న సింధుకు ఆల్ ద బెస్ట్.