ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన `పుష్ప 2` చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. రూ. 500 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాను త్రీడీ, ఐమాక్స్ వెర్షన్లో 12 వేల స్క్రీన్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 పై తారా స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ చిత్ర బృందం మరింత హైప్ పెంచుతోంది. ఇదిలా ఉండగా.. పుష్ప 2 బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి.
టాలీవుడ్ హిస్టరీలోనే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ సొంతం చేసుకున్న చిత్రంగా పుష్ప 2 అగ్రస్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రూ. 213 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఒక్క నైజాం ఏరియాలోనే వంద కోట్లకు పుష్ప 2 థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయాయి. అలాగే సీడెడ్ లో రూ. 30 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 23 కోట్లు, తూర్పు గోదావరిలో రూ. 14.40 కోట్లు, పశ్చిమలో రూ. 10.80 కోట్ల, గుంటూరులో రూ. 15.20 కోట్లు, కృష్ణలో రూ. 12.40 కోట్లు మరియు నెల్లూరు ఏరియాలో రూ. 7.20 కోట్లు రేంజ్ లో బిజినెస్ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 215 కోట్లు.
ఇక కర్ణాటకలో రూ. 32 కోట్లు, తమిళనాడులో రూ. 52 కోట్లు, కేరళలో రూ. 20 కోట్లు, హిందీ మరియు రెస్టాఫ్ ఇండియాలో రూ. 200 కోట్లకు థియేట్రికల్ రైట్స్ ను విక్రయించారు. ఓవర్సీస్ లో రూ. 100 కోట్ల బిజినెస్ జరిగింది. వరల్డ్ వైడ్ గా పుష్ప 2 టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ అక్షరాలు రూ. 617 కోట్లు. ఈ లెక్కన సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలవాలంటే థియేట్రికల్ రన్ ముగిసేలోపు రూ. 620 కోట్ల రేంజ్ లో షేర్, రూ. 1200 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోవాల్సి ఉంది.