సోషల్ మీడియాలో నోరు చేసుకోవడం.. దుర్భాషలాడడం ఇప్పుడు స్టయిల్‌గా మారిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భావప్రకటనా స్వేచ్ఛను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే.. ఈ సమాజం ఎటు పోతుందో కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు, వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్.. సజ్జల భార్గవరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఏపీ సీఐడీ అధికారులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. అయితే.. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేది లేదని.. ఏదైనా ఉంటే.. ఏపీ హైకోర్టుకే చెప్పుకోవాలని సజ్జలకు సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయితే.. దీనికి గాను 2 వారాల సమయం ఇస్తున్నట్టు తెలిపింది. ఈ సమయంలో సజ్జలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు సూచించింది. హైకోర్టు ఇరు పక్షాల వాదనలను వినాలని సూచించింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్లడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఇదేసమయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని దుర్భాషలా డే వారిని క్షమించలేమనితెలిపింది. “ఇప్పుడు ఇదొక ఫ్యాషన్. సోషల్ మీడియా వేదికను అడ్డు పెట్టుకుని నోరు పారేసుకుంటున్నారు. దుర్భాషలాడుతున్నారు. దీంతో ఎంత డ్యామేజీ జరుగుతోందో గుర్తించాలి. సమాజాన్ని ఎటు తీసుకువెళ్తున్నారు వీళ్లంతా! ఇలాంటి వారి విషయంలో కఠినంగానే వ్యవహరించాలి. ఈ కేసులో ఏం జరిగిందో మాకు అనవసరం. మీరు హైకోర్టులోనే చెప్పుకోండి. అక్కడ అన్నీ వింటారు“ అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.