మహారాష్ట్ర సీఎం పదవిపై వారం రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. మహాయుతి కూటమిలో సీఎం సీటు పంచాయతీ ఓ కొలిక్కి వచ్చింది. మహారాష్ట్రకు కాబోయే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అని బీజేపీ సీనియర్ నేత జాతీయ మీడియా సంస్థ పీటీఐకు వెల్లడించారు. డిసెంబరు 2 లేదా 3వ తేదీన బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుందని, బీజేపీ ఎల్పీ నేతగా ఫడ్నవీస్ ను ఎన్నుకుంటారని తెలుస్తోంది. సీఎంగా ఫడ్నవీస్ ఈ నెల 5న ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది.
సీఎం ఎవరన్నది బీజేపీ పెద్దలు నిర్ణయిస్తారని, వారి నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని మాజీ సీఎం షిండే ఈ రోజు అన్నారు. మహాయుతి కూటమి నేతల భేటీ రద్దు చేసుకుని షిండే తన సొంతూరికి వెళ్లడంతో ఆయన అలిగారని టాక్ వచ్చింది. సీఎం పదవి తనకే కావాలని షిండే పట్టుబట్టారని ప్రచారం జరిగింది. అయితే, తన పనుల మీద సొంతూరికివెళ్లానని, కాస్త విశ్రాంతి తీసుకున్నానని షిండే చెప్పారు. మహాయుతి కూటమి పాలన మరోసారి అందించేందుకు రెడీ అని షిండే చెప్పారు. ఈ ప్రభుత్వానికి తన సహకారం ఉంటుందన్నారు.