నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతోంది. కొత్త భామలు ఎంత మంది వస్తున్నా వారికి గట్టి పోటీ ఇస్తోంది. దక్షిణాది, ఉత్తరాది చిత్రాల్లో తీరిక లేనంతగా బిజీగా గడుపుతోంది. త్వరలోనే `పుష్ప 2` తో ప్రేక్షకులను పలకరించబోతోంది. మూడేళ్ల కిందట వచ్చిన ఈ సినిమా మొదట భాగం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే రెండో భాగంపై అంచనాలు తారా స్థాయిలో ఏర్పడ్డాయి.
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఈ యాక్షన్ డ్రామా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక.. పుష్ప మూవీ విశేషాలు, షూటింగ్ అనుభవాలు పంచుకుంది. అలాగే డిసెంబర్ అంటే తనకు చాలా సెంటిమెంట్ అని, తనకు లక్కీ మంత్ అని రష్మిక తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇందుకు కారణం లేకపోలేదు. రష్మిక హీరోయిన్ గా యాక్ట్ చేసిన తొలి సినిమా `కిరాక్ పార్టీ` డిసెంబర్ నెలలోనే విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది.
ఆ తర్వాత పునీత్ రాజ్ కుమార్తో నటించిన అంజనీపుత్ర, చమక్ సినిమాలు డిసెంబర్లోనే వచ్చి విజయం సాధించాయి. పుష్ప- ది రైజ్ 2021 డిసెంబర్ మంత్ లో విడుదలై ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రష్మికకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ లో కలిసి రష్మిక నటించిన యానిమల్ కూడా డిసెంబర్ లోనే రిలీజ్ అయింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఇక రష్మిక డిసెంబర్ సెంటిమెంట్ పుష్ప 2 కు కూడా కలిసొస్తే.. మరోసారి కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.