ఏపీలో వాలంటీర్ల కథ ముగిసిందా అంటే.. అవునన్న సమాధానమే వినిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. గత ఐదేళ్లు జగన్ హయాంలో వాలంటీర్లు చాలా కీలకంగా వ్యవహరించారు. పెన్షన్ల పంపిణీ, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చేందుకు వాలంటీర్లను వైసీపీ వారధిగా వాడుకుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా వాలంటీర్లనే ఆయుదంగా వాడుకుని మళ్లీ తమ జెండా ఎగురవేయాలని జగన్ భావించారు. కానీ చివరకు ఆయన ప్లాన్ బెడిసికొట్టింది.
ఇక వైసీపీ చేసిన ఓ తప్పిదం కారణంగా ఇప్పుడు ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కనుమరుగైపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. మండలిలో వాలంటీర్ వ్యవస్థపై చర్చ సందర్భంగా.. వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ, మంత్రి డోలా బాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు వేతనం పెంచుతామని కూటమి పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేథప్యంలోనే వాలంటీర్ల వ్యవస్థ, వారికి చెల్లించాల్సిన వేతనాల గురించి బోత్స ప్రశ్నించగా.. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ మనుగడలో లేదని మంత్రి డోలా అన్నారు. 2023 ఆగస్టు వరకు వాలంటీర్లను కొనసాగిస్తూ గత వైసీపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది.. కానీ ఆ తర్వాత వాలంటీర్ల వ్యవస్థను రెన్యువల్ చేయలేదని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆ వ్యవస్థ కనుమరుగైపోయిందని అన్నారు.
2023 ఆగస్ట్ నుంచి వాలంటీర్ల వ్యవస్థ ఉనికిలో లేదని మంత్రి తెలిపారు. ఈ నాడు వైసీపీ జీవో ఇచ్చుంటే వాలంటీర్లను కొనసాగించేవాళ్లమని.. అసలు వ్యవస్థలో లేని వాళ్లకు జీతాలెలా పెంచుతామని మంత్రి డోలా బాల ప్రశ్నించారు. లేని బిడ్డకు పేరు పెట్టమని, మరేదో చేయమని సభ్యులు ఎలా అడుగుతారని మంత్రి మండిపడ్డారు.