తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత వివాస్పద దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మకు తాజాగా ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసు నేపథ్యంలో అరెస్ట్ నుంచి రక్షించాలని ఆర్జీవీ కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఆయనకు ఊహించని షాక్ ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీకి మద్దతుగా `వ్యూహం` పేరుతో ఆర్జీవీ ఓ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
అయితే వ్యూహం ప్రమోషన్స్ సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లను లక్ష్యంగా చేసుకుని వర్మ అనుచిత పోస్టులు పెట్టారు. ఆ పోస్టులు అప్పట్లో పెను దుమారం రేపాయి. ఇక ఇదే అంశంపై ఇటీవల టీడీపీ నేత రామలింగం ప్రకాశం జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆర్జీవీపై కేసు నమోదు అయింది.
ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ హైదరాబాద్ వెళ్లి మరీ పోలీసులు ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు. నోటీసుల ప్రకారం రేపే ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలని, అలాగే తనపై నమోదు అయిన కేసును కొట్టేయాలని హైకోర్టులో వర్మ పిటిషన్ దాఖలు చేశారు. నేడు ఈ పిటిషన్ విచారణకు రాగా.. అరెస్ట్ నుంచి తాము రక్షించలేమని, ఇటువంటి అభ్యర్థనలు తమ ముందుద చేయొద్దని న్యాయస్థానం మొట్టికాయలు వేసింది.
వర్మ పిటిషన్ ను తిరస్కరించడమే కాకుండా.. అరెస్ట్ భయం ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని హితవు పలికింది. ఇక హైకోర్టులో అనుకూలంగా తీర్పు రాకపోవడంతో రేపు వర్మ విచారణకు హాజరవుతారా..? లేదా..? అనే హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ విచారణకు డుమ్మా కొడితే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడం ఖాయమవుతుంది.