సార్వత్రిక ఎన్నికలు ముగిశాక వైసీపీ కి షాకులు తగులుతూనే ఉన్నాయి. చోటా మోటా నాయకుల నుంచి మాజీ మంత్రులు, ఎంపీల వరకు ఒకరి తర్వాత ఒకరు జగన్ కు బై బై చెప్పేస్తున్నారు. జిల్లాల వారీగా వైసీపీ ఖాళీ అయిపోతుంది. నాలుగు రోజుల క్రితమే ప్రముఖ పారిశ్రామికవేత్త, గత వైసీపీ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన ఎస్. రాజీవ్ కృష్ణ పార్టీకి రాజీనామా చేశారు. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకున్నారు.
అయితే తాజాగా వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పలువురు సర్పంచ్ లు వైసీపీని వదిలి టీడీపీలోకి జంప్ అయ్యారు. జిల్లాలోని పాలకొల్లు మండలంలో 8 గ్రామాల సర్పంచులు మంత్రి నిమ్మల రామానాయుడు సమక్షంలో సైకిల్ ఎక్కేశారు. గ్రామ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్లు ఈ సందర్భంగా సర్పంచ్లు తెలిపారు. వైసీపీ పాలనలో సర్పంచ్ లకు కనీసం గౌరవం దక్కలేదని వాపోయారు.
కాగా, గత ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు సరైన నిధులు రాకపోవడంతో.. సర్పంచ్లు అప్పులు చేసి మరీ గ్రామాల్లో అభివృద్ది పనులు చేయించారు. చివరకు జగన్ వారికి మొండి చేయి చూపించడంతో అప్పులు కట్టలేక కొందరు ఆత్యహత్యలు కూడా చేసుకున్నారు. రోడెక్కి బకాయిలు చెల్లించాలని నిరసన తెలిపినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. దాంతో పార్టీపై అసహనం పెంచుకున్న సర్పంచులు.. ఇప్పుడు కూటమి పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు.