ఏపీకి నిధుల కేటాయింపులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఈరోజు పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీలో చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన వివరాలను నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మీడియాకు వెల్లడించారు. కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి జై శంకర్ తో చంద్రబాబు భేటీ అయ్యారని కృష్ణదేవరాయలు చెప్పారు.
మన దేశం నుంచి అమెరికాకు వెళ్లే విద్యార్థులు, పౌరుల స్థితిగతులపై, వీసా నిబంధనలపై జై శంకర్ తో చంద్రబాబు చర్చించారని ఆయన వెల్లడించారు. తెలుగువారు ఎదుర్కొంటున్న ఇమ్మిగ్రేషన్ సమస్యలను పరిష్కరించాలని జై శంకర్ ను చంద్రబాబు కోరారని చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీ అమలు చేస్తున్నామని, గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానంతో ముందుకు పోయేవారమని చంద్రబాబు చెప్పినట్లు వెల్లడించారు.
విదేశీ కంపెనీలు ఏపీకి పంపించేందుకు సహకరిస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబుకు హామీ లభించిందని లావు చెప్పారు. అమరావతి నిర్మాణంలో సింగపూర్ కీలకమని, ఆ దేశంతో భాగస్వామ్యాన్ని పునరుద్ధరించాలని చంద్రబాబు కోరారని తెలిపారు. చంద్రబాబు ప్రతిపాదనలపై జై శంకర్ సానుకూలంగా స్పందించారని అన్నారు. చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత ఏపీకి కేంద్రం వరాలు ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.