ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పై ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్ అయిన సంగతి తెలిసిందే. పట్టభద్రుల ఓట్ల నమోదును సీరియస్గా తీసుకోవడం లేదంటూ యువ మంత్రికి సీఎం ఓ రేంజ్ లో క్లాస్ పీకారు. ఇందుకు సంబంధించిన ఆడియో నెట్టింట వైరల్ కావడంతో.. మంత్రి వాసంశెట్టి పేరు వార్తల్లో మారుమోగిపోయింది. చంద్రబాబు మందలించడంపై వాసంశెట్టి సున్నితంగా రియాక్ట్ అయ్యారు.
చంద్రబాబు ఒక తండ్రిలా వ్యవహరించి తప్పు సరిచేసుకునే ప్రయత్నం చేశారని.. తాను ఇకపై బాధ్యతగా పని చేస్తానని వాసంశెట్టి చెప్పుకొచ్చారు. అయితే ఈ ఘటన ఇంకా మరవక ముందే మంత్రి వాసంశెట్టికి మళ్లీ అక్షింతలు పడ్డాయి. ఈసారి అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు వాసంశెట్టిపై సీరియస్ అయ్యారు. ఈ రోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయానికి వాసంశెట్టి సుభాష్ రాకపోవడంతో.. స్పీకర్ ప్రశ్నను వాయిదా వేశారు.
కొద్దిసేపటికి వాసంశెట్టి అసెంబ్లీకి వచ్చారు. టైమ్ సెన్స్ లేకపోవడంతో వాసంశెట్టి సుభాష్ కు స్పీకర్ అయ్యన్న చురకలు అంటించారు. ప్రజల కోసం గళం విప్పాల్సిన అసెంబ్లీలో, అది కూడా బాధ్యతాయుత మంత్రి పదవిలో ఉండి ఆలస్యంగా వస్తే ఎలా? అని ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. మంత్రులందరూ టైమ్ కు రావాలని.. లేదంటే అసెంబ్లీ సమయం వృథా అవుతుందని అయ్యన్న హితవు పలికారు. దాంతో తన అలసత్వంపై మంత్రి వాసంశెట్టి సుభాష్ క్షమాపణ చెప్పారు.