ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు వైసీపీ రెబల్ నేతగా ఉన్న సమయంలో జగన్, వైసీపీ నేతలను ముప్పుతిప్పలు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే తమ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడన్న అక్కసుతో రఘురామపై రాజద్రోహం కేసు పెట్టి జగన్ వేధించారని ఆరోపణలు వచ్చాయి. కస్టడీలో తనను పోలీసులతో టార్చర్ చేయించారని జగన్ పై రఘురామ షాకింగ్ ఆరోపణలు కూడా చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఎన్డీఏ ప్రభుత్వంలో రఘురామకు అసెంబ్లీ స్పీకర్ పదవి ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది.
కానీ స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజును నియమించారు. వైసీపీ హయాంలో వైసీపీ రెబల్ నేతగా తిరుగుబాటు బావుటా ఎగురవేసిన రఘురామకు టీడీపీ, జనసే, బీజేపీల నుంచి మద్దతు లభించింది. అయితే, జగన్ అసెంబ్లీకి వస్తే డిప్యూటీ స్పీకర్ హోదాలో స్పీకర్ కుర్చీలో రఘురామ కూర్చుంటే ఆ సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
కానీ, అసెంబ్లీకి జగన్ డుమా కొట్టడంతో వీరిద్దరి మధ్య సంభాషణ జరిగే అవకాశం దాదాపుగా ఉండబోదని తెలుస్తోంది. అయితే కొద్ది నెలల క్రితం ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసే సందర్భంగా జగన్ తో అసెంబ్లీ లాబీలో రఘరామ మాట్లాడిన వీడియో అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా, ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ గా వినుకొండ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జీవీ ఆంజనేయులు నియమితులయ్యారు