నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన కూటమి పార్టీల సమన్వయ సమావేశం సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అవమానం జరిగిన సంగతి తెలిసిందే. అధికారులు బొకే అందించకపోవడం, వేమిరెడ్డి పేరు పిలవకపోవడంతో ఆయన అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సంబంధిత అధికారిణి వేమిరెడ్డి కి సారీ చెప్పినా, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆయన వినకుండా కారులో వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కూడా ప్రభాకర్ రెడ్డి వెంటే వెళ్లిపోయారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబును వేమిరెడ్డి కలిశారు. తన సతీమణి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో కలిసి ముఖ్యమంత్రితో ఆయన భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వేమిరెడ్డి దంపతులు వచ్చారు. అయితే, వేమిరెడ్డి ప్రశాంతిని టీటీడీ పాలకమండలి సభ్యురాలిగా నియమించించిన నేపథ్యంలో భర్త ప్రభాకర్ రెడ్డితో కలిసి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నిన్నటి ఘటనపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇటువంటివి ఇకపై జరగకుండా అధికారులకు మంత్రి నారాయణ కఠినమైన ఆదేశాలు జారీ చేయడం కూడా చర్చకు వచ్చిందని తెలుస్తోంది.