ఏపీ పోలీసులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న పవన్…లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలపై పోలీసులు తీరును పవన్ తప్పుబట్టారు. ‘‘హోం మినిస్టర్ అనిత గారికి కూడా చెబుతున్నాను..హోం మినిస్టర్ మీరు.. నేను పంచాయతీ రాజ్, పర్యావరణ, అటవీశాఖా మంత్రిని…పరిస్థితి చేయిదాటితే హోం శాఖను నేను తీసుకుంటాను…అదే జరిగితే పరిస్థితులు వేరుగా ఉంటాయి’’ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో షాకింగ్ గా మారాయి.
తాను హోం శాఖా మంత్రి అయితే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాగా డీల్ చేస్తానని, తన పదవి పోయినా ప్రజల కోసం పోరాడతానని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బయటకు వస్తే తమను తిడుతున్నారని…ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ అధికారులకు చెబుతున్నానని పవన్ అన్నారు. మూడేళ్ల ఆడబిడ్డను రేప్ చేస్తే కులాన్ని వెనకేసుకొస్తున్నారని, క్రిమినల్స్ కు కులం ఉంటుందా అని పోలీస్ అధికారులను పవన్ ప్రశ్నించారు. ఐపీఎస్ అధికారులు ఇండియన్ పీనల్ కోడ్ చదవలేదా అని నిలదీశారు.
గత ప్రభుత్వంలో ప్రజలకు అభివాదం చేస్తున్న తనను కూర్చొవాంటూ గరుడ అనే ఓ పోలీసు అధికారి భయపెట్టేందుకు ప్రయత్నించారని, మరి, ఇప్పుడు రేపిస్టులను ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నించారు. జగన్ పాలనలో శాంతిభద్రతలపై నియంత్రణ లేదని, ఇప్పుడు ధర్మబద్ధంగా శాంతిభద్రతలు అమలు చేయమంటుంటే మీనమేషాలు లెక్కిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. పవన్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత, పోలీసు ఉన్నతాధికారుల స్పందన ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.