మాజీ సీఎం జగన్ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), తిరుమల వెంకన్న పవిత్రతను దెబ్బతీశారని తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీటీడీ ఛైర్మన్, పాలకమండలి నియామకంలో జగన్ తన అనుయాయులకు పెద్దపీట వేశారని విమర్శలు వచ్చాయి. ఇక, తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం తిరుమలపై జగన్ సర్కార్ కు ఉన్న శ్రద్ధకు పరాకాష్ట అని దేశవ్యాప్తంగా పలువురు దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే ఏపీలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం నియమించబోతోన్న టీటీడీ చైర్మన్, పాలక మండలి సభ్యుల వివరాలపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది.
ఆ ఉత్కంఠకు తెరదించుతూ తాజాగా టీటీడీ ఛైర్మన్, పాలకమండలి సభ్యుల పేర్లను ప్రకటించారు. టీవీ5 అధినేత బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ గా నియమితులయ్యారు. 24 మంది సభ్యులతో పాలకమండలిని ప్రకటించగా…తెలంగాణ నుంచి ఐదుగురికి చోటు దక్కింది. ఏపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు చోటు దక్కించుకున్నారు.
తనను టీటీడీ ఛైర్మన్ గా నియమించిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ లకు బీఆర్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. చిత్తూరు జిల్లాకు చెందిన తనకు పెద్ద బాధ్యతను అప్పగించారని, అక్కడే పుట్టి, అక్కడే పెరిగిన తాను తిరుమలకు చాలా చేయాల్సి ఉందని అన్నారు. తిరుమలలో పలు అంశాల్లో ప్రక్షాళన చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తానని అన్నారు.
24 మంది టీటీడీ బోర్డు సభ్యులు…
జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే), వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి (కోవూరు ఎమ్మెల్యే), ఎంఎస్ రాజు (మడకశిర ఎమ్మెల్యే), పనబాక లక్ష్మి (కేంద్ర మాజీ మంత్రి), జాస్తి పూర్ణ సాంబశివరావు, నన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ), శ్రీ సదాశివరావు నన్నపనేని, కృష్ణమూర్తి (తమిళనాడు), కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, జంగా కృష్ణమూర్తి, దర్శన్ ఆర్ఎన్ (కర్ణాటక), జస్టిస్ హెచ్ఎల్ దత్ (కర్ణాటక), శాంతారామ్, పి.రామ్మూర్తి (తమిళనాడు), జానకీ దేవి తమ్మిశెట్టి, బూంగునూరు మహేందర్ రెడ్డి (తెలంగాణ), అనుగోలు రంగశ్రీ (తెలంగాణ), బూరగాపు ఆనంద్ సాయి (ఆర్ట్ డైరెక్టర్, తెలంగాణ), సుచిత్ర ఎల్ల (తెలంగాణ), నరేశ్ కుమార్ (కర్ణాటక), డా.ఆదిత్ దేశాయ్ (గుజరాత్), శ్రీసౌరభ్ హెచ్ బోరా (మహారాష్ట్ర).