మాస్ కా బాప్, నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోన్న ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ షో మూడు సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకొని నాలుగో సీజన్ లోకి అడుగుపెట్టింది. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ కు అతిథిగా ఆంధ్రులు ఆరాధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చారు. బావాబామ్మర్దుల సరదా కబుర్లు, సీరియస్ సంభాషణలతో షో రసవత్తరంగా సాగింది. ముందుగా చంద్రబాబును సాదరంగా ఆహ్వానించిన బాలకృష్ణ.. ‘‘ద్వాపరయుగంలో బావమరిది భవద్గీత చెబితే.. బావ విన్నాడు. ఇక్కడ బావ చెబితే.. బావమరిది వింటున్నాడు’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. తనకు అది ‘గీత’తో సమానమంటూ ‘అన్స్టాపబుల్’ పుస్తకంపై చంద్రబాబుతో సరదాగా ప్రమాణం చేయించారు.
తన సోదరి భువనేశ్వరికి సంబంధించిన ప్రశ్నలతో పాటు జైల్లో చంద్రబాబు అనుభవాల వరకు బాలయ్య ఎన్నో ప్రశ్నలు అడిగారు.
బావతో కలిసి కాఫీ తాగి పుష్కరం అయిందని తన చెల్లి భువనేశ్వరి తనతో చెప్పిందని బాలయ్య అన్నారు. భువనేశ్వరి హైదరాబాద్ లో, తాను అమరావతిలో ఉంటున్నామని, కాబట్టి చాలా తక్కువ రోజులు ఇద్దరం ఒకచోట కలుస్తామని చంద్రబాబు చెప్పారు. ఉండవల్లిలో ఉన్నప్పుడు డైనింగ్ టేబులే తన పార్ట్ నర్ అని జోక్ చేశారు. ఇక, ఖాళీ సమయం దొరికితే భువనేశ్వరితో కలిసి బాలయ్య సినిమాలు చూస్తానని, రాజకీయాల నుంచి రిలాక్స్ కావడానికి బాలయ్య సినిమాలే డైవర్షన్ అని చెప్పారు. బాలయ్య కన్నా బ్రాహ్మణి అంటే ఇష్టమని చెప్పి బాలయ్యను ఉడికించారు చంద్రబాబు.
ఇక, తన అరెస్టు గురించి చెబుతూ చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. నంద్యాలలో ఓ సభ పూర్తయిన తర్వాత బస్సులో పడుకొని ఉంటే పోలీసులు వచ్చి లేపారని, అరెస్టు చేస్తున్నామని చెప్పారని గుర్తు చేసుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా, విచారణాధికారి లేకుండా అరెస్ట్ చేశారని చెప్పారు. ఈ రకంగా అరెస్టు చేయడంపై విమర్శలు వచ్చాయని, దేశవ్యాప్తంగా చాలామంది తన అరెస్టును ఖండించారని అన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకు మద్దతుగా పలువురు ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, ప్రజలు నిరసన తెలిపిన వీడియోలను ప్లే చేశారు.
అరెస్టయిన రోజు రాత్రి నంద్యాల నుంచి విజయవాడకు, అక్కడి నుంచి కోర్టుకు, అక్కడి నుంచి రాజమండ్రి జైలుకు తీసుకెళ్లారని…అది ఒక కాళరాత్రి అని గుర్తు చేసుకున్నారు. తప్పు చేయకుండా జైలుకు వెళ్లాల్సి వచ్చిందని చాలా బాధేసిందని, తన జీవితంలో ఆ రోజు ఎప్పటికీ మరచిపోలేనని భావోద్వేగానికి గురయ్యారు. జైల్లో తనను మానసికంగా దెబ్బతీయాలని చూశారని, కొన్ని అనుమానాస్పద ఘటనలు జరిగాయని చెప్పారు. తాను ధైర్యంగా ఉండబట్టి ఈ రోజు ఇలా ఉన్నానని, లేకుంటే ఏమైనా జరిగేదని అన్నారు.
జైల్లో ఉన్న 53 రోజులు అనుక్షణం ప్రజల గురించి ఆలోచించానని అన్నారు. చనిపోతే ఒక్క క్షణం, కానీ, ఆశయం కోసం పని చేస్తే అది శాశ్వతం అని జైల్లో గడిపానని చెప్పారు. ఆ ఆలోచనే తనను ముందుకు నడిపింని, చావు గురించి ఆలోచిస్తే జీవితంలో ఏదీ సాధించలేమని చెప్పారు. కుటుంబ సభ్యులు, ప్రజలు, శ్రేయోభిలాషుల వల్లే తాను ఈ రోజు ఇలా ఉన్నానని చెప్పారు.