గడిచిన కొద్దిరోజులుగా గుట్టుగా ఉన్న ఒక అంశంపై ఒక క్రమపద్దతిలో సాగుతున్న ప్రచారం.. అంతకంతకూ ముదురుతోంది. తెలుగు మీడియా లో ప్రముఖుడిగా.. అత్యంత శక్తివంతుడిగా.. దమ్మున్నోడిగా పేరున్న ఒక మీడియా అధినేత రెండో పెళ్లి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలం క్రితం భార్య మరణంతో సింగిల్ గా ఉన్న ఆయనకు ఒక వైద్యురాలిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయినట్లుగా చెబుతున్నారు.
ఆయన్ను వ్యతిరేకించే కోటరీకి చెందిన కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు ఈ విషయాన్ని ఓపెన్ గా చర్చించుకుంటున్నాయి. అదే సమయంలో రెండు రోజులుగా సదరు వైద్యురాలి ఫోటోలుసైతం వాట్సాప్ లోనూ.. సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారుతున్నాయి. తెలుగు జర్నలిజానికి దమ్మును పరిచయం చేయటమే కాదు.. ఎంతటోడైనా సరే.. తన మాటలకు డంగు కావాలన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. రెండో పెళ్లి నేరమా? అదో వార్తనా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఒక ప్రముఖుడికి చెందిన వ్యక్తిగత విషయాలపై చర్చ సరికాదన్న వాదన ఒకవైపు వినిపిస్తుంటే.. లేటు వయసులో ఘాటు ప్రేమతో పెళ్లాడాలని అనుకుంటున్న సమాచారం ఆసక్తికరం కాకుండా ఎందుకు ఉంటుందన్న బదులు మాట వినిపిస్తోంది. గడిచిన కొద్దిరోజులుగా హైదరాబాద్ లో లేని ఆ మీడియా ప్రముఖుడి వ్యక్తిగత విషయాలు ఇప్పుడు సంచలనంగా మారటంతో పాటు.. మీడియా వర్గాల్లో హాట్ చర్చకు తెర తీశాయి.
ప్రముఖుల వ్యక్తిగత జీవితాలు వార్తాంశాలు ఎందుకు కావాలన్న చర్చ పాతదే. అయితే.. జనాసక్తి ఉండటం.. ఇప్పుడు వార్త అనే పదానికి చెప్పే అర్థం.. నిర్వచనం మారిపోవటం.. ప్రజల్లో ఆసక్తి కలిగించే ఏ సమాచారమైనా అది వార్తే అవుతుందన్న మాట వినిపిస్తోంది. పనిలో పనిగా.. సదరు ప్రముఖుడి రెండో పెళ్లి పేరుతో మసాలా వంటకాన్ని మరికొందరు వండి వడ్డిస్తున్నారు. లేటు వయసులో రెండో పెళ్లికి సిద్ధమైన ఆయన నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించటం లేదని చెబుతున్నారు. అయితే.. అందులో నిజం ఎంత? అన్న దానిపై స్పష్టత రావట్లేదు. అయితే.. సదరు మీడియా ప్రముఖుడి స్థైర్యాన్ని దెబ్బతీయటం కోసమే ఇలాంటి ప్రచారాన్ని చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
సామాన్యుడైనా.. ప్రముఖుడైనా తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవటం తప్పు కాదు. తమకున్న పరిమిత జ్ఞానంతో అలాంటి నిర్ణయాల మీద తమకు తోచిన రీతిలో తీర్పులు ఇవ్వటం మాత్రం తప్పే అవుతుంది. ఎవరి వ్యక్తిగత జీవితం వారిది. తరచి చూస్తే.. ప్రతిఒక్కరి జీవితంలో ఏదో ఒక అంశం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వయసు అన్నది అంకె మాత్రమే. అందునా.. వయసు పెరిగే కొద్దీ జీవితభాగస్వామి అవసరం చాలా ఉంటుంది. ఆ విషయాన్ని వదిలేసి.. ఇష్టారాజ్యంగా వ్యాఖ్యానించటం అవివేకమే అవుతుంది. వైరల్ గా మారిన మీడియా ప్రముఖుడి రెండో పెళ్లి అంశం వాస్తవమే అయితే.. దాన్ని ఆహ్వానించటంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే.. ఆయనేమీ చట్టవిరుద్ధమైన పని చేయట్లేదన్నది మర్చిపోకూడదు.