అధికారాన్ని నిలుపుకోవటమే తప్పించి.. దేశం ఏమై పోయినా.. దేశ ప్రజలకు ఎన్ని తిప్పలు ఎదురవుతున్నా పట్టించుకోని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కు సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సెంటిమెంట్ ను రాజేసి.. ఏదోలా వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో విజయం కోసం తప్పుడు ఆట ఆడుతున్న అతగాడికి అంతకంతకూ గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆయన రాజీనామాకు సొంతం పార్టీ (లిబరల్)కి చెందిన 24 మంది ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా ట్రూడోకు డెడ్ లైన్ విధించారు సొంత పార్టీ ఎంపీలు. ఇప్పటికే మైనార్టీలో ఉన్న అతడి సర్కారుకు.. తాజా హెచ్చరిక మరింత ఇబ్బందికరంగా మారింది. కెనడా ప్రధాని ట్రూడో రాజీనామా చేయాలన్న లేఖపై 153 మంది ఎంపీల్లో 24 మంది ఎంపీలు సంతకాలు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ తీవ్రంగా దెబ్బ తినటానికిట్రూడో వైఖరే కారణమని దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ట్రూడో ఏర్పాటుచేసిన మీడియాసమావేశంలో తమ పార్టీ ఐకమత్యంగా ఉందని.. తన సారథ్యంలోనే వచ్చే ఎన్నికలకు వెళుతున్నట్లుగా పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. కెనడా ప్రతిపక్ష నేత ప్రధాని ట్రూడోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు సమావేశాల్లో ఆయన ట్రూడో సర్కారుపై నిప్పులు చెరిగారు. దేశాన్నినాశనం చేయటం తప్పించి సరి చేయటం అన్నది ట్రూడోకు చేతకాదంటూ ఘాటుగా రియాక్టు అయ్యారు పియుర్రె పొయిలీవ్రే. ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై ట్రూడో మండిపడుతూ.. తమ ప్రభుత్వ ఆర్థిక విధానాల్ని ఆయన సమర్థించుకున్నారు. ప్రతిపక్ష నేత కెనడా బ్రోకెనిస్ట్ ప్లాన్లను మరోసారి తెరమీదకు తెస్తున్నట్లుగా ఆరోపించారు.
ఈ వ్యాఖ్యపై ప్రతిపక్ష నేత స్పందిస్తూ.. బ్రోకెనిస్ట్ అనేది ఆంగ్ల పదం కాదని.. ట్రూడో ఆ భాషను ముక్కలు చేస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు. ఆయన వ్యాఖ్యపై సభ ఘోల్లున నవ్వటం గమనార్హం. మొత్తంగా చూస్తే.. ఓవైపు ప్రతిపక్షం.. మరోవైపు స్వపక్షం రెండూ ట్రూడో తీరును తప్పు పడుతున్న తీరు.. ఆయన పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేస్తుందని చెప్పాలి.