ఏపీ మాజీ సీఎం జగన్ హయాంలో అమరావతి రాజధాని నిర్మాణం నిర్వీర్యమైన సంగతి తెలిసిందే. సగం పూర్తయిన నిర్మాణాలు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే అమరావతి రాజధాని నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు ఇటీవల రీస్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. సీఆర్డీఏ అథారిటీ బిల్డింగ్ పనులు సగం నిలిచిపోగా ఆ పనులను పున:ప్రారంభించడంతో అమరావతి రీస్టార్ట్ బటన్ ను చంద్రబాబు నొక్కారు. ఈ క్రమంలోనే అమరావతిలో నిర్మాణాలను పరుగులు పట్టించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అమరావతి నిర్మాణంలో భాగంగా గతంలో పిలిచిన కాంట్రాక్టులను 15 రోజుల్లో రద్దు చేస్తున్నామని నారాయణ ప్రకటించారు. వాటి స్థానంలో కొత్త కాంట్రాక్టులను ఆహ్వానించబోతున్నామని వెల్లడించారు. నవంబర్, డిసెంబర్ నెలలో అమరావతి నిర్మాణానికి సంబంధించిన అన్ని పనులకు టెండర్లు పిలుస్తామని నారాయణ చెప్పారు. 360 కిలోమీటర్ల ట్రంకు రోడ్లు, లేఅవుట్లు, కొండవీడు, పాలవాగు, గ్రావిటీ కెనాల్, కరకట్ట రోడ్డుకు టెండర్లు పిలవబోతున్నామన్నారు.
ఇక, సచివాలయ భవనాల నిర్మాణాలకు డిసెంబర్ లో, అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణాలకు వచ్చే ఏడాది జనవరి నెలలో టెండర్లు ఖరారు చేస్తామన్నారు. అమరావతి రైల్వే కనెక్టివిటీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేయడం శుభ పరిణామమని నారాయణ హర్షం వ్యక్తం చేశారు.