ఏపీ సీఎం చంద్రబాబు చొరవతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికమైన అమరావతి రైల్వే కనెక్టివిటీ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపిన సంగతి తెలిసిందే. దాదాపు 2300 కోట్ల రూపాయలతో ఈ భారీ ప్రాజెక్టు ఏపీకి రాబోతోంది. అమరావతికి ఉత్తర, మధ్య, దక్షిణ మధ్య రైల్వేలకు కనెక్ట్ చేస్తూ ఏర్పాటు కాబోతున్న ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక ఈ ప్రాజెక్టుతో పాటుగా కృష్ణా నదిపై రైల్వే వంతెనని కూడా నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ రెండిటికి కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర కూడా వేసింది.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ స్పందించారు. అమరావతి రైల్వే కనెక్టివిటీ లైన్ తో పాటు రణస్థలం ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును ఏపీకి కేటాయించడంపై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు కూడా అయిన లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు. వీటిని సాధించడంలో ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల చొరవ అభినందనీయమన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు ఏపీలో మౌలిక సదుపాయాల రంగానికి గణనీయంగా ఊతమిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు, పవన్ గుణాత్మక అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని లక్ష్మీనారాయణ ప్రశంసించారు.