యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఏళ్లు కాస్తా నెలలు..అది కాస్తా వారాలు.. రోజుల్లోకి వచ్చేసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపునకు పెన్సిల్వేనియా రాష్ట్రం కీలకంగా మారనుంది. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపునకు ఈ రాష్ట్రంలో విజయం సాధించటం కీలకం కానుంది.
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్.. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హ్యారీస్ బరిలో ఉండటం తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది. ఇరువురి మధ్య ఉత్కంట పోరు నడుస్తున్న వేళ.. పెన్సిల్వేనియాలో విజయం అధ్యక్ష ఎన్నికల విజయంలో కీ రోల్ గా మారింది.
పెన్సిల్వేనియాలో 19 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు ఉన్నాయి. అత్యధికంగా కాలిఫోర్నియాలో 54 ఓట్లు ఉన్నాయి. డెమొక్రాట్లకు కంచుకోటగా దీన్ని అభివర్ణిస్తారు. అదే సమయంలో రిపబ్లికన్లు బలంగా ఉండే టెక్సాస్ లో 40 ఓట్లున్నాయి. అమెరికాలో పలు రాష్ట్రాలు ఉన్నప్పటికీ.. ఏడు కీలక రాష్ట్రాలపైనే అభ్యర్థుల చూపు ఉంది. దీనికి కారణం.. ఈ రాష్ట్రాల్లో ఎలక్టోరల్ ఓట్లు అధికంగా ఉండటమే.
అరిజోనాలో 11, విస్కాన్సిన్ 10.. మిషిగన్ 15.. పెన్సిల్వేనియా 19.. జార్జియా 16.. నార్త్ కరోలినా 16 ఉన్నాయి. పెన్సిల్వేనియాలో గెలవకుండా 270 ఎలక్టోరల్ ఓట్లు సాధించటం అసాధ్యం. 270టు విన్.కామ్ వెబ్ సైట్ అంచనా ప్రకారం హారిస్ కు 226 ఓట్లు.. ట్రంప్ నకు 219 ఓట్లు రావొచ్చన్నది అంచనా. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి.
ట్రంప్ ను అధ్యక్షుడ్ని చేసింది పెన్సిల్వేనియానే. అదేసమయంలో ఆయన్ను అధ్యక్ష పదవికి దూరం చేసింది పెన్సిల్వేనియాలోనే. 2016 ఎన్నికల్లో ట్రంప్ కేవలం ఒక శాతం ఓట్లతో గెలవగా.. అదే ఒక శాతం ఓట్ల తేడాతో 2020లో జరిగిన ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని కోల్పోయారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో ఇరువరు అభ్యర్థుల మధ్య పోరు నువ్వానేనా అన్నట్లు సాగుతోంది.
పెన్సిల్వేనియా మీద ఫోకస్ చేసిన ఈ ఇద్దరు.. ఇక్కడే తమ సమయాన్ని.. శక్తిని.. డబ్బును.. ప్రచారాన్ని ఎక్కువగా నిర్వహిస్తున్నారు. గడిచిన మూడునెలల్లో రెండు పార్టీలకు చెందిన దాదాపు 50 సభలు ఇక్కడే జరిగాయంటే ఇక్కడ పోటీ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మరింత వివరంగా చెప్పాలంటే.. ప్రతి నాలుగు డాలర్లలో ఒక డాలర్ ను ఈ రాష్ట్రంలోనే ప్రకటనల కోసం రెండు పార్టీలు ఖర్చు చేస్తుండటం గమనార్హం. ఇక్కడి ఓటర్లను ఆకర్షించేందుకు ట్రంప్ అయితే ఏకంగా మెక్ డొనాల్డ్ లో ఆ సంస్థ యూనిఫాం వేసుకొని మరీ సిబ్బందిలా పని చేసి.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మరి.. ఈసారి పెన్సిల్వేనియా ఎవరిని వరిస్తుందో చూడాలి.