ఏపీలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పెన్షన్ లతో పాటు అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన కూటమి ప్రభుత్వం మరిన్ని పథకాలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి ఉచితంగా మూడు సిలెండర్లు ఇచ్చే పథకాన్ని ప్రారంభించబోతున్నట్లుగా సీఎం చంద్రబాబు ప్రకటించారు.
దీపావళి కానుకగా ఈ నెల 31వ తేదీ నుంచి దీపం పథకాన్ని మహిళలకు ప్రభుత్వం అందించబోతోందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, సూపర్ సిక్స్ అమలులో భాగంగా దీపం పథకం అమలు గొప్ప ముందడుగు అని చంద్రబాబు అన్నారు. ఈ దీపావళి పండుగ నాడు ఇళ్లలో దీపం పథకం వెలుగులు నింపుతోందని ఆశిస్తున్నానని అన్నారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ప్రతి నాలుగు నెలలకు ఒక సిలెండర్ చొప్పున పొందే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నెల 24 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకునే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 31 నుంచి పంపిణీ ప్రారంభించాలని స్పష్టం చేశారు. సిలిండర్ తీసుకొన్న లబ్ధిదారులకు 2 రోజులకు వారి బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీ జమ చేయాలని, ఆ రకంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు.