వైసీపీ హయాంలో అధికారం అండ చూసుకుని.. చాలా మంది నాయకులు రెచ్చిపోయారు. మంత్రుల నుంచి నాయకుల వరకు.. ఏకంగా సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరకు పార్టీ ప్రభుత్వం మారేసరికి వారంతా చిక్కుకుపోతున్నారు. అయితే..ఇ లాంటి కీలక సమయంలో వీరికి అండగా ఉండడమో.. న్యాయ సేవ అందించడమో చేయాల్సిన వైసీపీ.. వారిని వదిలించుకునేందుకు ప్రయత్నిస్తోంది.
తాజాగా వైసీపీ ఏడాదిన్నర కిందట ఏరి కోరి.. ఎంచుకుని మరీ కర్నూలు జిల్లాకు చెందిన ముస్లిం మహిళ జకియా ఖనమ్‌కు.. ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. అప్పటి వరకు ఆమె ఎవరో కూడా పెద్దగా తెలియదు. అలాంటి ఆమెను మండలికి తెచ్చింది. దీనిని ఆనాడు మైనారిటీలకు తాము ఇస్తున్న ప్రాధాన్యంగా జగన్ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఏకంగా మండలి డిప్యూటీ చైర్ పర్సన్‌గా కూడా ఆమెకు ప్రమోషన్ ఇచ్చారు. దీనిని కూడా మరింత హైలెట్ చేసుకున్నారు.
కట్ చేస్తే.. జకియా ఖనమ్‌పై తిరుమలలో కేసు నమోదైంది. ఆమెతో పాటు చంద్రశేఖర్, ఆమె పీఏ కృష్ణతేజపై బెంగళూరుకు చెందిన శశికుమార్ అనే వ్యక్తి కేసు పెట్టారు. శ్రీవారి బ్రేక్ దర్శనంతో పాటు వేదాశీర్వాదం కోసం రూ.65 వేలు తీసుకుని టికెట్లు విక్రయించారని, అవి పనిచేయలేదని, తనను మోసం చేశారని శశికుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వైసీపీ యూటర్న్..
అయితే..ఈ సమయంలో వైసీపీ యూటర్న్ తీసుకుంది. వీఐపీ దర్శనం టికెట్లు అమ్ముకున్న జకియా ఖానంతో వైసీపీకి సంబంధం లేదనిమాజీ మంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆమె విషయాన్ని అనవసరంగా వైసీపీకి అంటగట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని కూడా మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాగానే జకియా ఖనమ్ టీడీపీలోకి వెళ్లారని చెప్పారు. కానీ, వాస్తవానికి ఆమె ఇంకా టీడీపీలో చేరలేదు. నారా లోకేష్‌తో భేటీ అయిన మాట వాస్తవం. అయితే.. దీనికే వైసీపీ ఆమెను పక్కన పెట్టేసి.. కీలక సమయంలో తమకు సంబంధం లేదని చెప్పడం గమనార్హం.