ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన గాడిన పడిన సంగతి తెలిసిందే. ఓ పక్క సీఎం చంద్రబాబు అమరావతి రాజధాని పునర్నిర్మాణంపై ఫోకస్ పెడితే మరో పక్క మంత్రి లోకేష్ ఆర్ధిక రాజధాని విశాఖపై దృష్టి సారించారు. రెండ్రోజులుగా విశాఖలో పర్యటిస్తున్న లోకేష్…తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కానివ్వబోమని హామీనిచ్చారు. ఈ క్రమంలోనే నేడు విశాఖలో పలు చోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన లోకేష్..కొందరు అధికారులు, ఉద్యోగులకు షాకిచ్చారు.
నెహ్రూ బజార్ లోని ప్రాంతీయ గ్రంథాలయాన్ని, మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలను తనిఖీ చేసిన లోకేష్ లైబ్రరీ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. ఉదయం 8 గంటలకు లైబ్రరీ తెరవాల్సి ఉండగా… 9.45 గంటలకు కూడా తెరవకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత ఉద్యోగికి ఫోన్ చేసి ప్రశ్నించారు. గ్రంథాలయాల బలోపేతానికి, పబ్లిక్ లైబ్రరీల పర్యవేక్షణకు ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని లోకేష్ నిర్ణయించారు. విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విధంగా లైబ్రరీలను తీర్చిదిద్దాలని, దేశంలోనే బెస్ట్ మోడల్ ను అధ్యయనం చేసి పబ్లిక్ లైబ్రరీల వ్యవస్థను పటిష్టం చేయాలని ఆదేశించారు.
ఆ తర్వాత మున్సిపల్ ఎలిమెంటరీ స్కూలును తనిఖీ చేసిన లోకేష్..అంగన్వాడీ బాలల గదిని సందర్శించారు. కాసేపు సరదాగా పిల్లలతో గడిపిన లోకేష్…పిల్లలకు రైమ్స్ వచ్చా అని అడిగారు. వారంతా సరదగా ఆడుతూ పాడుతూ సమాధానాలిచ్చారు. పిల్లలకు గుడ్లు, పౌష్టికాహారం సరఫరాపై టీచర్లను లోకేష్ ఆరాతీశారు. విద్యార్థులకు చాక్లెట్లు పంచి, వారితో కలిసి ఫొటోలు దిగారు. ఏది ఏమైనా ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ మాదిరి నేరుగా తనిఖీలు చేపట్టిన లోకేష్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.