ఏపీలో ప్రైవేటుగా రిటైల్ వైన్ షాపుల ఏర్పాటు పూర్తి అయిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడపగ ఈసారి టెండర్లను ఆహ్వానించి ప్రైవేటు వ్యక్తులు వైన్ షాపులు నిర్వహించేలాగా కొత్త లిక్కర్ పాలసీని ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. అయితే, ఈ నూతన మద్యం పాలసీపై ఏపీ మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. టిడిపి నేతల జేబులు నింపేందుకే ఇటువంటి ప్రైవేట్ విధానాన్ని తీసుకువచ్చారని జగన్ ఆరోపించారు. ఈ క్రమంలోనే జగన్ పై వినుకొండ ఎమ్మెల్యే, టిడిపి సీనియర్ నేత జీవీ ఆంజనేయులు జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
కూటమి ప్రభుత్వంపై జగన్ చేస్తున్నవి దిగజారుడు వ్యాఖ్యలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ నేపథ్యంలో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. జగన్ పాలనలో మద్యం లైసెన్సులు ఇచ్చింది ఎవరు? లక్షల కోట్ల రూపాయలు కొట్టేసింది ఎవరో ప్రజలకు తెలుసు అని విమర్శించారు. త్వరలోనే ఆ లెక్కలను జగన్ తీరిగ్గా జైల్లో కూర్చుని వేసుకోవచ్చు అని జీవి ఆంజనేయులు సెటైర్లు వేశారు. నాసిరకం మద్యం అందించి అధిక ధరలు వసూలు చేసి జగన్ ప్రభుత్వం దోపిడీకి పాల్పడిందని ఆయన ఆరోపించారు.