సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ హయాంలో జంగిల్ గా మారిన అమరావతిని మళ్లీ సాధారణ స్థితికి తెచ్చే పనులను యుద్ధప్రాతిపదికన చంద్రబాబు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే అమరావతి పునర్నిర్మాణంలో చంద్రబాబు మరో అడుగు ముందుకు వేశారు. జగన్ కక్ష సాధింపు చర్యల వల్ల సగంలో ఆగిపోయిన బిల్డింగ్ ల నిర్మాణ పనులను ఒక్కొక్కటిగా చంద్రబాబు పట్టాలెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు అమరావతిలో సీఆర్డీఏ ప్రాజెక్టు ఆఫీసు పనులను చంద్రబాబు పున: ప్రారంభించబోతున్నారు,
2018లో 160 కోట్ల రూపాయల వ్యయంతో ఏడంతస్తుల్లో సిఆర్డిఏ ఆఫీసును నిర్మించాలని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఆ పనులను జగన్ ప్రభుత్వం పక్కన పెట్టడంతో నిర్మాణ పనులు సగంలోనే ఆగిపోయాయి. ఈ క్రమంలోనే ఈనెల 16న జరిగిన సిఆర్డిఏ అథారిటీ సమావేశంలో ఆ పనుల పునః ప్రారంభంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో భూమి పొందిన వారు మళ్లీ నిర్మాణాలు చేపట్టే అంశంపై కూడా అధికారులతో చంద్రబాబు మాట్లాడారు. అమరావతిని సంపద సృష్టికి కేంద్రంగా మార్చే విధంగా ప్రణాళికలు వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఎడ్యుకేషన్ హబ్ గా ఏపీ ఎదిగేలా ఎటువంటి సంస్థలను ఆహ్వానించాలి అనే అంశాలు కూడా ఆ మీటింగ్ లో చర్చకు వచ్చాయని తెలుస్తోంది. జీవో నెంబర్ 2007 ప్రకారం 8352 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలోనే అమరావతి రాజధాని ఉండాలని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. గతంలో గుర్తించిన విస్తీర్ణం ప్రకారం సీఆర్డీఏ పరిధి ఉండాలని చంద్రబాబు సూచించారు. ఇక మంగళగిరి మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలను వెనక్కి తీసుకోవాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు.
జగన్ ప్రభుత్వం కుట్రపూరితంగా తీసుకువచ్చిన ఆర్ 5 జోన్ పై కూడా చంద్రబాబు స్పందించారు. జగన్ తీసుకున్న చట్ట వ్యతిరేక నిర్ణయాలపై సమీక్ష జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం, 4 లైన్లుగా కరకట్ట నిర్మాణంపై ముందుకు వెళ్లాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.