మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ దారుణ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాబా సిద్ధిఖీని చంపింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. సిద్ధిఖీని చంపేస్తామంటూ 15 రోజుల క్రితం బెదిరింపు కాల్ రావడంతో ఆయనకు పోలీసులు భద్రతను పెంచారు. అయితే, గత నెల రోజులుగా రెక్కీ చేసిన నిందితులు ఈ దారుణానికి పాల్పడ్డారని తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు సన్నిహితుడిగా బాబా సిద్ధికీకి గుర్తింపు ఉంది. సల్మాన్ ఖాన్ ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చాలాకాలంగా టార్గెట్ చేసింది. బాబా సిద్ధికీ హత్య నేపథ్యంలో సల్మాన్ ఖాన్ భద్రతపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ముంబయిలోని సల్మాన్ నివాసం వద్ద భద్రత పెంచారు.
మరోవైపు, సల్మాన్ ఖాన్ భారీ భద్రత మధ్య బాంద్రాలోని బాబా సిద్ధిఖీ నివాసానికి వచ్చారు. సిద్ధిఖీ కుటుంబ సభ్యులను సల్మాన్ ఓదార్చారు. బిగ్ బాస్ 18 షూటింగ్ మధ్యలో ఆపేసి హుటాహుటిన సిద్ధికీ ఇంటికి సల్మాన్ వచ్చారు.