శవం కనబడితే చాలు ఆయన ముఖంలో చిరునవ్వులు కనిపిస్తాయి.. ఎక్కడా లేని హుషారు వచ్చేస్తుంది.. ఆ ఘటన నుంచి రాజకీయ లబ్ధి పొందే వీలుందని తెలిస్తే చాలు.. అందుకోసం భారీ స్కెచ్ వేసేస్తారు. దీనిని చంద్రబాబుకు ఎలా ఆపాదించాలా అని ఆలోచిస్తారు.. ఏ మాత్రం తడబడకుండా మీడియా ముందుకు వచ్చి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పేస్తారు.. ఆయనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ . హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తండ్రి రాజశేఖర్‌రెడ్డి మృతదేహం ఇంకా ఇంటికి రాకముందే తనకు సీఎం పదవి కట్టబెట్టాలంటూ నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించిన ఆయన.. అందుకు కాంగ్రెస్ అధిష్ఠానం నిరాకరించినందుకు కత్తిగట్టారు.
ఆ సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు చనిపోయినా.. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక గుండె పగిలి చనిపోయారని జాబితాలో చేర్చారు.. వారిని ఓదార్చేందుకు యాత్ర చేపట్టి.. అధిష్ఠానం కాదన్నందుకు సొంత పార్టీ పెట్టుకున్నారు. రూ.లక్ష కోట్ల అవినీతి వ్యవహారంలో సీబీఐ అరెస్టు చేయడంతో 16 నెలలు జైల్లో ఉండి.. తిరిగి సోనియాగాంధీ కాళ్లు పట్టుకుని రాష్ట్ర విభజనకు అంగీకరించి బెయిల్ తెచ్చుకున్నారు. 2014లో తనను ఆంధ్ర ప్రజలు ఓడించినందుకు రగిలిపోయారు.
చంద్రబాబుపై అబద్ధాలు ప్రచారం చేసి.. పోలవరం, రాజధానిపై విషం చిమ్మారు. చిన్నాన్న వివేకానందరెడ్డి హత్యను కూడా ఆయనకు అంటగట్టి… అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని రావణ కాష్ఠం చేశారు. జనం మానప్రాణాలకు రక్షణ లేకుండా చేసిన ఆయన.. ప్రజలు తనను ఘోరంగా ఓడించడంతో తట్టుకోలేకపోతున్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసిన రెండ్రోజులకే.. ఎక్కడో కర్నూలు జిల్లాలో ఓ ఫ్యాక్షన్ గొడవ జరిగితే.. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని యాగీ ప్రారంభించారు.
ప్రజలు తనకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వకుండా మూలన కూర్చోబెట్టడంతో.. ఆ హోదా తనకివ్వాలని ఏకంగా స్పీకర్‌కే లేఖ రాశారు. ఆ హోదా ఇస్తే తనకు కేబినెట్ ర్యాంకు లభిస్తుంది.. పోలీసు భద్రత భారీగా ఉంటుంది. వివిధ సౌకర్యాలు ఉంటాయి. అదీ సంగతి. సీఎంగా ఉన్నప్పుడు నియంతలా వ్యవహరించి తన తాడేపల్లి నివాసం వైపు ఎవరూ రాకుండా రోడ్లన్నీ మూసివేసి.. భారీగా పోలీసు బలగాలను మోహరించి.. ఏకంగా వెయ్యి మందితో కనీవినీ ఎరుగని రీతిలో భద్రత ఏర్పాటు చేసుకున్న ఆయన.. ఇప్పుడు అవన్నీ పోవడం తట్టుకోలేకపోతున్నారు.
మావోయిస్టుల హిట్‌లిస్టులో ఉన్న చంద్రబాబుకు భద్రత తగ్గించేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు. చివరకు కేంద్రం, కోర్టుల జోక్యంతో వెనకడుగు వేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఎంతో పెద్ద మనసుతో జగన్‌కు జడ్ ప్లస్ భద్రత ఏర్పాటుచేశారు. అయినా ఆయనకు సంతృప్తి లేదు. ప్రతిపక్ష హోదా రాకపోవడంతో జనం తనను పట్టించుకోవడం లేదని ఆయన వాపోతున్నారు. అందుకే రాష్ట్రంలో శాంతిభద్రతలపై జాతీయ స్థాయిలో యాగీ చేస్తే కేంద్రం తనకు మరింత రక్షణ కల్పిస్తుందని, మాజీ సీఎం అని ప్రజలు కూడా గుర్తిస్తారని ఎత్తువేశారు. ఇందుకోసం వినుకొండలో వైసీపీ కార్యకర్త హత్యను ఆయుధంగా వాడుకోవడం మొదలుపెట్టారు.
‘కారు’ డ్రామా!
ఎన్నికల్లో దారుణ పరాజయం తాలూకు దుగ్ధ జగన్ ప్రతి మాటలో, చేతలో బయటపడుతోంది. వినుకొండలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు రషీద్, జిలానీ మధ్య ఏడాదిగా వ్యక్తిగత కక్షలున్నాయి. ఇటీవల పరస్పర దాడుల్లో రషీద్‌ను జిలానీ హత్య చేశాడు. అతడిని పోలీసులు అరెస్టుచేశారు. చంపానని అతడే అంగీకరించాడు. కానీ జగన్ ఒప్పుకోలేదు. టీడీపీ వాళ్లే జిలానీతో చంపించారని.. వారిపైనా కేసుపెట్టాలని, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
వారెవరని అడిగితే అది పోలీసులు చేయాల్సిన పని అని బదులిచ్చారు. గుడ్డ కాల్చి ముఖంపై వేయడమే ఆయన నైజం. హత్యను రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకున్నారు. అంతే.. బెంగళూరు యలహంక ప్యాలెస్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన.. హుటాహుటిన తాడేపల్లి వచ్చారు. జూలై 19న వినుకొండ పర్యటన తలపెట్టారు. సరే.. ఓదార్పు యాత్ర ఆయనకు కొత్తేమీ కాదు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. మాజీ సీఎం కావడం.. జడ్ ప్లస్ భద్రత కూడా ఉన్నందున ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ కారు ఏర్పాటు చేశారు. అయితే అది టాటా సఫారీ వాహనం. జగన్‌కు నచ్చలేదు.
సీఎంగా ఉన్న ఐదేళ్లూ ఆయన ల్యాండ్ క్రూయిజర్ ప్రడో కారు వాడారు. తనకు అదే కావాలన్నారు. పోలీసులు కుదరదన్నారు. చంద్రబాబు సీఎంగా, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆ సఫారీయే వాడారు. తప్పుడు కేసులో ఆయన్ను నంద్యాలలో అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చి.. తదనంతరం రాజమహేంద్రవరం వరకు తీసుకెళ్లిందీ ఆ కారులోనే. అయినా అది మాజీ రాజుగారికి నచ్చలేదు. అది కండిషన్లో లేదంటూ ఆయన చానల్ కథనాలు వండివార్చింది. ఆ కారు అలా ఎక్కి ఐదు నిమిషాల్లోనే వేరే కారెక్కారు. అయితే ఆ సఫారీ ఆయన కాన్వాయ్‌లోనే ఎక్కడా ఆగకుండా ప్రయాణించడం గమనార్హం.
పరామర్శా.. ప్రచార యాత్రా?
జగన్ వినుకొండ పర్యటన రషీద్ కుటుంబానికి పరామర్శలా కాకుండా.. ప్రచార యాత్రలా సాగింది. హతుడి కుటుంబాన్ని ఓదార్చి సహాయం అందించాల్సిన మాజీ సీఎం.. రషీద్ హత్య వ్యక్తిగత కక్షలతో జరగలేదని, రాజకీయ హత్యేనంటూ రాజకీయ రంగు పులిమారు. వ్యక్తిగత గొడవలు, ఫ్యాక్షన్ మర్డర్లు, ఇతరత్రా కారణాలవల్ల జరిగే హత్యలు.. ఏదైనా టీడీపీ మీద తోసేయడమే! 2014-19 మధ్య జగన్ అనుసరించిన విష వ్యూహం ఇదే.
చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు.. అది చంద్రబాబు పనేనంటూ ‘నారాసుర రక్త చరిత్ర’ పేరిట తన రోతపత్రికలో నీచ రాతలు రాశారు. కోడికత్తి ఘటన జరిగినప్పుడు కూడా టీడీపీని హంతక పార్టీలా చూపించేందుకు చేతిలోని అన్ని ప్రచార అస్ర్తాలను యథేచ్ఛగా వాడుకున్నారు. చివరికి.. ఈ రెండు ఘటనల్లోనూ ఉన్నది వైసీపీకి సంబంధించిన వ్యక్తులేనని తేలింది. ఇప్పుడు చంద్రబాబు సర్కారు వచ్చి… పూర్తిగా కుదురుకోకముందే మళ్లీ అదే విష వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
వినుకొండలో గ్యాంగ్ వార్ కారణంగా హత్య జరిగితే.. అది చంద్రబాబు ప్రభుత్వమే చేయించిందనే అర్థం వచ్చేలా ‘నారా రూప రాక్షకుడు’ అని తన రోతపత్రికలో విషం చిమ్మారు. వినుకొండలో హతుడూ, హంతకుడూ ఇద్దరూ ఒకప్పుడు వైసీపీ స్థానిక నేత గ్యాంగ్‌లోని సభ్యులే. రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన జగన్పక్కన ఆ గ్యాంగ్ లీడర్ కూడా పక్కనే ఉన్నాడు. కోడికత్తి దాడి కేసులో జూలై 19న విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టులో హాజరు కావలసిన జగన్.. అది తప్పించుకోవడానికే వినుకొండ పర్యటన చేపట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు ప్రభుత్వం శ్వేతపత్రాలు ప్రవేశపెడితే తన అరాచకాలు బయటకు వస్తాయనే 24న ఢిల్లీలో ధర్నాచేశారు.
ఆ ఐదేళ్లలో సర్వం విధ్వంసం.. నరమేధమే..
రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు ధ్వంసం చేసి అప్పుల ఊబిలోకి నెట్టేసిన జగన్… ఇప్పుడు రాషా్ట్రనికి పెట్టుబడులు రాకుండా కుట్ర చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. చిన్నస్థాయి ఘటనలు, ఇతర కారణాలవల్ల జరిగిన హత్యలకు సైతం రాజకీయ రంగుపులిమి… రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ జాతీయ స్థాయిలో గగ్గోలు పెట్టేందుకు వ్యూహం రచించారు.
జగన్ ప్రభుత్వంలో ఇటు అనంతపురం నుంచి అటు శ్రీకాకుళం దాకా.. రక్తంతో తడవని రోజు, దౌర్జన్యం, కక్ష సాధింపులు జరగని సందర్భం ఒక్కటి కూడా లేదు. నంద్యాలలో అబ్దుల్ సలామ్ కుటుంబం వైసీపీ దాష్టీకానికి బలైపోయింది. కడప జిల్లా పొద్దుటూరులో చేనేత సుబ్యయ్య హత్య, చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి అరాచకాలు, నెల్లూరు కోర్టులో మాజీ మంత్రి కాకాణి కోసం దొంగతనం, అదే జిల్లాలో బీజేపీ మహిళపై కత్తులతో దాడి, ప్రకాశం జిల్లాలో మైనింగ్ దోపిడీ, బీసీ వర్గానికి చెందిన బాలుడు అమర్నాథ్ గౌడ్ హత్య, పల్నాడులో జై జగన్ అనేందుకు నిరాకరించిన చంద్రయ్య హత్య.. జగన్ అరాచక పాలనకు నిదర్శనంలా నిలిచాయి.
అలాగే, గుంటూరులో రంగనాయకమ్మను సీఐడీ వేధించిన వైనం, రాజధాని మహిళా రైతులపై దాడులు, డీజీపీ ఆఫీసు పక్కనే టీడీపీ కార్యాలయం ధ్వంసం, ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగి రమేశ్‌కు మంత్రి పదవి ఇవ్వడం, విజయవాడలో టీడీపీ కార్పొరేటర్ గాంధీ కన్ను పొడిచేయడం, టీడీపీ నేత పట్టాభి ఇంటిపై దాడులకు తెగబడటం, కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి, ఉభయ గోదావరి జిల్లాల్లో దళితుడికి పోలీసు స్టేషన్లో శిరోముండనం, వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్‌ను చంపి శవాన్ని డోర్‌డెలివరీ చేయడం, కాకినాడలో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరాచకాలు, అనకాపల్లిలో కోడిగుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ దోపిడీ, దౌర్జన్యాలు.. దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోని మాజీ సైనికుడిపై పోలీసుల దాడి.. ఇవన్నీ ఫ్యాక్షన్ పాలనకు నిదర్శనాలు.
ఇక విశాఖపట్నంలో దళిత వైద్యుడు సుధాకర్‌ను నడిరోడ్డులో రెక్కలు విరిచి పోలీసులతో కొట్టించిన దుర్మార్గం, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి సెటిల్మెంట్లు, వైసీపీ మూకల బెదిరింపులు, కబ్జాలు, హత్యలు.. విజయనగరంలో రాముడి విగ్రహ ధ్వంసం, పరిశీలించేందుకు వెళ్లిన చంద్రబాబు, టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసులు పెట్టడం ఇవన్నీ జగన్ మరచిపోయారు. ప్రశ్నించే వ్యక్తులపై అక్రమ కేసులు, బెదిరింపులు.. ప్రతిపక్షాలపై అణచివేతలు, దాడులు.. 2019 జూన్ నుంచి ఇటీవలి వరకూ రాష్ట్రంలో నిత్యకృత్యం.
బీసీ నాయకుడు అచ్చెన్నాయుడు నుంచి అనంతపురంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి వరకూ తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపేదాకా జగన్ మనసు శాంతించలేదు. అసెంబ్లీలో అడిగిన ప్రతిసారీ తనకు మైకు ఇవ్వలేదన్న అక్కసుతో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును వేధించారు. ఆయనపై చిల్లర దొంగతనం కేసుపెట్టించి ఆత్మహత్యకు పురిగొల్పారు. రాష్ట్ర రాజకీయాల్లో పెద్దమనిషిగా మృదు స్వభావిగా పేరున్న అశోక్ గజపతిరాజును ఆయన కుటుంబం నిర్మించిన సింహాచలం, రామతీర్థం ఆలయాల్లోకి రానివ్వకుండా చేసి పైశాచిక ఆనందాన్ని పొందారు. ఎదుటి వ్యక్తిని ఒక్క మాట కూడా అనని కొల్లు రవీంద్రను ఏకంగా హత్య కేసులో జైలుకు పంపారు.
తన సొంతూరు పులివెందులలో ఒక దళిత మహిళకు మద్దతుగా ఆందోళన చేసినందుకు వంగలపూడి అనిత(ఎస్సీ)పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారు. వీటన్నింటికీ పరాకాష్ఠగా చంద్రబాబుపై స్కిల్ కుంభకోణం కేసు బనాయించి అక్రమంగా అరెస్టు చేయించి 53 రోజులు జైల్లో పెట్టించారు. రాజమహేంద్రవరం జైల్లో ఉన్న చంద్రబాబును పరామర్శించేందుకు హైదరాబాద్ నుంచి కారులో వస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను రాష్ట్ర సరిహద్దుల్లోనే అడ్డుకున్నారు. అంతకు ముందు జనసేన సభకు స్థలం ఇచ్చిన ఇప్పటం రైతుల ఇళ్లు కూల్చివేయించారు.
ప్రజల వినతులు తీసుకోవడానికి విశాఖపట్నం వెళ్లిన పవన్ కల్యాణ్‌పై దాడులు చేయించి పోలీసులతో నిర్బంధించడంతోపాటు జనసైనికులపై తప్పుడు కేసులు, హత్యాయత్నం సెక్షన్లు పెట్టి జైల్లో పెట్టించారు. ఇక అమరావతి రైతులు, మహిళలపై పోలీసులు, వైసీపీ మూకల ద్వారా ఆయన సాగించిన అకృత్యాలకు అంతేలేదు. వారిని పరామర్శించి వస్తున్న బీజేపీ నాయకుడు సత్యకుమార్(ప్రస్తుతం రాష్ట్ర మంత్రి)పై రాజధాని ప్రాంతంలో దాడి చేయించారు. మందడం ప్రాంతానికి వెళ్లిన చంద్రబాబు వాహనంపై చెప్పులు, రాళ్లు వేయించారు.
జగన్ తాను అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై విచక్షణా రహితంగా దాడులు చేయించారు. ఇవన్నీ బయటకు వస్తాయన్న భయం ఇప్పుడాయన్ను వెంటాడుతోంది. తమ వాళ్లను చట్టబద్ధంగా శిక్షిస్తారన్న ఆందోళనతో ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాల్జేసేందుకు ముందుగానే శాంతిభద్రతల వైఫల్యమంటూ నిరసనలకు దిగారు.