శ్రీను వైట్ల.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో టాప్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన వారులో ఒకరు. నీ కోసం మూవీతో డైరెక్టర్ గా మారిన శ్రీను వైట్ల.. సొంతం, వెంకీ, ఢీ, దుబాయ్ శీను, దూకుడు వంటి చిత్రాలతో భారీ స్టార్డమ్ సంపాదించుకున్నారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ కు మోస్ట్ వాంటెడ్ గా మారారు. కానీ తర్వాతి కాలంలో వరుస పరాజయాల కారణంగా శ్రీను వైట్ల తన ఫామ్ ను కోల్పోయారు. 2018 తర్వాత శ్రీను వైట్ల నుంచి మరో సినిమా రాలేదు.
సుమారు ఐదేళ్ల గ్యాప్ అనంతరం శ్రీను వైట్ల తెరకెక్కించిన చిత్రం `విశ్వం`. ఇందులో టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, కావ్యా థాపర్ జంటగా నటించారు. యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న విశ్వం అక్టోబర్ 11న థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ శ్రీను వైట్ల తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. విశ్వం మూవీ విశేషాలతో పాటు పలు పర్సనల్ విషయాలు కూడా పంచుకున్నారు.
ముఖ్యంగా మహేష్ బాబుతో తీసిన ఆగడు సినిమానే తనను ముంచేసిందని శ్రీను వైట్ల అభిప్రాయపడ్డారు. దూకుడు వంటి బ్లాక్ బస్టర్ అనంతరం శ్రీను వైట్ల, మహేష్ కాంబోలో వచ్చిన రెండో చిత్రమే ఆగడు. 2014లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. ఆగడుతోనే శ్రీను వైట్ల కెరీర్ డౌన్ ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది.
తాజా ఇంటర్వ్యూలో శ్రీను వైట్ల మాట్లాడుతూ.. `నా కెరీర్ లో నేను చేసిన పెద్ద పొరపాటు ఏదైనా ఉందంటే అది ఆగడు చేయడమే. వాస్తవానికి మేము మొదట అనుకున్న కథ వేరు. అయితే ఆ స్థాయి కథ నిర్మాతలకు మరింత భారమవుతుందని భావించి, వేరే స్టోరీని అనుకుని సినిమా చేశాం. కానీ దూకుడు హిట్ తో ప్రేక్షకుల్లో అంచనాలు భారీ పెరిగాయి. ఆ అంచనాలను ఈ కథ అందుకోలేకపోయింది. నాకు నేనుగా తీసుకున్న గొయ్యి అది` అంటూ చెప్పుకొచ్చారు. ఆగడు వల్లే ఆ కెరీర్ పోయిందని శ్రీను వైట్ల కుండబద్దలు కొట్టారు. ఇక తన రాబోయే చిత్రం విశ్వం తప్పకుండా హిట్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గోపీచంద్ మార్క్ యాక్షన్ తో పాటు, నా మార్క్ కామెడీ టచ్ ఉంటుందని.. సినిమా చూసి ఆడియెన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారని శ్రీను వైట్ల పేర్కొన్నారు.