టీడీపీ నేత, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. మహిళా ఉద్యోగుల వాట్సాప్ నంబర్లకు శ్రీనివాసరావు అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. మరోవైపు, తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, తాను తప్పు చేసినట్లు వచ్చిన ఆరోపణలు నిజమైతే తనను అరెస్టు చేసి శిక్షించాలని కొలికపూడి అంటున్నారు. ఒకవేళ తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాకపోతే తనపై ఆరోపణలు చేసిన వారిని శిక్షించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే తన క్యాంప్ కార్యాలయంలో కొలికపూడి దీక్ష కూడా చేపట్టారు. అయితే, పార్టీ అధిష్టానం చెప్పడంతో తన దీక్షను నిన్న రాత్రి విరమించారు.
ఈ క్రమంలోనే కొలికిపూడికి తాజాగా మహిళలు మరో షాకిచ్చారు. శ్రీనివాసరావును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ చిట్టేల గ్రామంలో మహిళలు రహదారిపై నిరసన ప్రదర్శన చేశారు. మహిళలపై కొలికపూడి చేసిన అనుచిత వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలికపూడి శ్రీనివాసరావుపై చర్యలు తీసుకొని తమకు రక్షణ కల్పించకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని మహిళలు హెచ్చరించారు.
అయితే, ఈ ఆరోపణలను కొలికపూడి ఖండిస్తున్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న మహిళ ఇప్పటిదాకా నాలుగు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని, ఆమె భర్తపై పోలీసులు కేసు పెట్టిన వెంటనే ఇటువంటి ఆత్మహత్య డ్రామా ఆడుతుంటుందని ఆరోపించారు. తనపై పథకం ప్రకారమే అసత్య ప్రచారం మొదలుబెట్టారని, ఈ ప్రచారాన్ని నియోజకవర్గ ప్రజలు నమ్మవద్దని అన్నారు.
గతంలో వైసిపి కౌన్సిలర్ ఇంటి కూల్చివేత వ్యవహారంలో కొలికపూడి అత్యుత్సాహం చూపించారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాటు 30 ఏళ్లుగా నియోజకవర్గంలో టీడీపీ కోసం తాము పని చేశామని, నిన్నగాక మొన్న వచ్చిన కొలికపూడి తమను సస్పెండ్ చేస్తామని చెబుతున్నారని కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఏదేమైనా అమరావతి రైతుల ఉద్యమ నేతగా వెలుగులోకి వచ్చిన కొలికపూడికి చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సముచితంగా గౌరవించారని, కానీ కొలికపూడిపై ఇటువంటి ఆరోపణలు, విమర్శలు రావడంతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని టాక్ వస్తోంది.