‘యాపిల్’ సంస్థకు కాకినాడ వినియోగదారుల కమిషన్ షాకిచ్చింది. బాధితుడికి రూ.లక్ష మేర చెల్లించాలని స్పష్టం చేసింది. ఇందుకు సదరు సంస్థ చేసిన ప్రకటనే కారణంగా పేర్కొంది. ఐఫోన్ కొంటే ఇయర్ పాడ్స్ ఫ్రీగా ఇస్తామన్న యాడ్ చూసి ఫోన్ కొన్నట్లుగా బాధితుడు పేర్కొన్నారు. ‘ఇయర్ పాడ్స్’ ఇవ్వకుండా మోసం చేసినట్లుగా పేర్కొంటూ కమిషన్ ను ఆశ్రయించికి వ్యక్తికి ఊరట కలిగిస్తూ తమ నిర్ణయాన్ని తాజాగా వెల్లడించారు. అంతేకాదు ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి చెల్లించాలని ఆదేశాలు జారీ చేయటం విశేషం.
అంతేకాదు ఇయర్ పాడ్స్ ను కానీ ఆ మొత్తానికి విలువైన వాటిని చెల్లించని కారణంగా వినియోగదారును మానసికంగా క్షోభకు గురి చేసినందుకు బదులుగా రూ.10వేలు.. కోర్టు ఖర్చులుగా రూ.5వేలను చెల్లించాలని పేర్కొంది. కాకినాడ కు చెందిన పద్మరాజు అనే వ్యక్తి 2021 ఆక్టోబరు 13న యాపిల్ అధికారిక వెబ్ సైట్ నుంచి రూ.85,800 విలువైన ఐఫోన్ ను కొనుగోలు చేశారు.
ఆ సమయంలో ఐఫోన్ కొన్న వారికి రూ.14,900 విలువైన ఇయర్ పాడ్స్ ను ఉచితంగా ఇస్తామని యాపిల్ సంస్థ పేర్కొంది. ఆన్ లైన్ లో చెల్లింపులు పూర్తి చేసిన తర్వాత ఐఫోన్ ను పంపారు. ఉచితంగా ఇస్తామని పేర్కొన్న ఇయర్ పాడ్స్ ను పంపలేదు. దీంతో.. బాధితుడు యాపిల్ కస్టమర్ కేర్ ను సంప్రదించాడు. అయినప్పటికీ వారి నుంచి సానుకూల స్పందన రాకపోవటంతో.. కంపెనీ ప్రతినిధులకు తమ వేదనను వెల్లబోసుకున్నాడు. అయినా ఫలితం రాలేదు.
ఈ నేపథ్యంలో 2022 ఫిబ్రవరి 15న వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు. అతడి వాదనను విన్న కమిషన్ అధ్యక్షుడు చెరుకూరి రఘుపతి వసంత్ కుమార్ సభ్యులు చెక్కా సుశీ.. చాగంటి నాగేశ్వరరావు.. ముంబయి కేంద్రంగా పని చేస్తున్న యాపిల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు రూ.లక్ష ఫైన్ షాకిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ వైనం స్థానికంగా సంచలనంగా మారింది.