శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు సిద్ధమైన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం కాలినడకన తిరుమల చేరుకుని, శనివారం స్వామివారి దర్శించుకోవాలని జగన్ భావించారు. కానీ ఇదే టైమ్ లో డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. అన్యమతస్తులు శ్రీవారి దర్శనానికి వెళ్తే డిక్లరేషన్ ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది.
అయితే గతంలో మాదిరిగా జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల ఆలయంలో అడుగు పెడితే ఊరుకునే ప్రసక్తే లేదని.. క్రైస్తవుడు అయిన ఆయన డిక్లరేషన్ పై సైన్ చేయాలని కూటమి పార్టీలు, ఇతర హిందూ ధార్మిక సంస్థలు స్ట్రాంగ్ గా డిమాండ్ చేస్తున్నాయి. సీఎంగా ఉన్న గత ఐదేళ్లు తిరుమలలో ఆలయ సంప్రదాయాలు, సనాతన ధర్మాన్ని జగన్ గౌరవించలేదని.. కానీ ఈసారి డిక్లరేషన్ ఇవ్వకపోతే అలిపిరి వద్దనే అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు పలు హిందూ సంఘాలు జగన్ తిరుమలకు రావొద్దంటూ నిరసన తెలుపుతున్నారు.
ఇలాంటి తరుణంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. జగన్ రెడ్డి తిరుమల టూర్ క్యాన్సిల్ అయింది. జగన్ రాకను అందరూ వ్యతిరేకిస్తున్న వేళ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన పర్యటన సాఫీగా సాగటం అసాధ్యంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మరికాసేపట్లో జగన్ మీడియా ముందుకు రానున్నారని సమాచారం.