తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ వ్యవహారం సినీ పరిశ్రమలోనూ అగ్గి రాజేసింది. లడ్డూ కావాలా నాయనా అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు….లడ్డూ టాపిక్ చాలా సెన్సిటివ్, మనకు వద్దు అంటూ కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది. దీంతో, లడ్డూపై జోక్స్ వేయవద్దని కార్తీని పరోక్షంగా పవన్ హెచ్చరించారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ వ్యాఖ్యలపై కార్తీ స్పందించారు. తన వ్యాఖ్యలపై అనుకోని అపార్థం ఏర్పడిందని, అందుకు తాను క్షమాపణలు చెబుతున్నానని కార్తీ అన్నారు.
పవన్ కల్యాణ్ గారంటే తనకు చాలా గౌరవం అని, తన వ్యాఖ్యలపై అనుకోని అపార్థం ఏర్పడించిన కార్తీ చెప్పారు. తాను కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడిని అని, హిందూ, సనాతన ధర్మాన్ని తాను ఎప్పుడూ గౌరవిస్తానని కార్తీ చెప్పారు. దీంతో, ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడినట్లు కనిపిస్తోంది. ఇక, ప్రకాష్ రాజ్ పేరు ప్రస్తావించి మరీ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. సెక్యులరిజం అంటూ ప్రకాష్ రాజ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని, లడ్డూ వివాదంతో ప్రకాష్ రాజ్ కు ఏం సంబంధం అని పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
అంతకుముందు, కోలీవుడ్ సీనియర్ హీరో, విలక్షణ నటుడు అరవింద స్వామి, కార్తీ నటిస్తున్న చిత్రం ‘సత్యం సుందరం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా కార్తీని యాంకర్ ఓ ప్రశ్న అడిగింది. ‘లడ్డూ కావాలా నాయనా.. ఇంకో లడ్డూ కావాలా నాయనా’ అంటూ యాంకర్ ప్రశ్నించింది. దీంతో, ఆ ప్రశ్నకు కార్తీ లౌక్యంగా జవాబిచ్చాడు.. “ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు. ఆ టాఫిక్ చాలా సెన్సిటివ్. మనకు వద్దు.” అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు. దాంతో, మీకు మోతీ చూర్ లడ్డూ ఇస్తామని యాంకర్ జోక్ చేసింది.
ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై పవన్ స్పందించారు. కొందరు లడ్డూ మీద జోకులు వేస్తున్నారని, నిన్న ఒక సినిమా ఫంక్షన్ లో లడ్డూ టాఫిక్ చాలా సెన్సిటివ్ అని అన్నారని పరోక్షంగా కార్తీ కామెంట్లను ప్రస్తావించారు. లడ్డూ టాపిక్ సెన్సిటివ్ కాదు.. దయచేసి ఎవ్వరూ అలా అనొద్దు..అనే సాహసం చేయొద్దు అని పవన్ అన్నారు. ఆ క్రమంలోనే పవన్ కామెంట్లపై స్పందించిన కార్తీ క్షమాపణలు చెప్పారు.