పొదుపుకు కక్కుర్తికి మధ్య వ్యత్యాసం బోలెడంత. సాదాసీదా మనిషి కూడా ఇట్టే పట్టేస్తాడు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల ఆలయంలో భక్తులకు ఇచ్చే లడ్డూ ప్రసాదం విషయంలో కక్కుర్తి అవసరమా? డబ్బులు మిగల్చాలి? పొదుపు చేయాలన్నదే లక్ష్యమైనప్పుడు.. వేస్టుగా డబ్బులు పోయే దగ్గర కట్టడి చేయాలే తప్పించి.. నాణ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి కదా? ఆ విషయంలో గత ప్రభుత్వం ఏం చేసిందన్నది ప్రశ్న.
ప్రస్తుతం లడ్డూ ప్రసాదంలో వాడిని నెయ్యి.. దాని నాణ్యత.. అందులో వాడిన పదార్థాల మీద జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఇదంతా ఎందుకు? నెయ్యిని సప్లై చేసే సంస్థ దగ్గర కాసుల కక్కుర్తే కదా? కర్నాటకకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన నందిని కానీ.. గుజరాత్ నుంచి ఏపీకి పిలిపించి మరీ పెట్టుబడులు పెట్టించిన అమూల్ దగ్గర కానీ ఆవునెయ్యి కొనొచ్చు కదా? వారి విషయంలో తేడా వచ్చే అవకాశాలు నూటికి ఒకట్రెండు శాతం కూడా ఉండదు. అలాంటప్పుడు ప్రసిద్ధ కంపెనీల వద్ద కాకుండా.. పేరు తెలియని కంపెనీల దగ్గర ఆవునెయ్యి ఎందుకు కొన్నట్లు? గత ప్రభుత్వాలు కూడా కొన్నాయి కదా? లాంటి మాటలు మాట్లాడితే.. వారు చేసిందే మీరు చేయాల్సిన అవసరం ఏముంది? గత పాలకుల కంటే మరింత మెరుగైన విధానాల్న ప్రవేశ పెట్టొచ్చు కదా?
లడ్డూ తయారీలో వాడే ఆవునెయ్యి లీటరు రూ.320 చొప్పున కొన్నట్లుగా చెబుతున్నారు. అంత తక్కువ ధరకు ఇచ్చే ఆవునెయ్యి ఎలా ఉంటుందన్నది తెలియదా? 45 సార్లు అయ్యప్పమాల వేసుకున్న సుబ్బారెడ్డి లాంటి పెద్ద మనిషికి ఆవునెయ్యి నాణ్యత గురించి తెలియకుండా ఉండదు కదా? మరి.. అలాంటప్పుడు తక్కువ ధరకు ఇచ్చే ఆవునెయ్యి కంటే.. పేరున్న కంపెనీల వద్ద ఆవునెయ్యి ఎందుకు కొనలేదు?
జగన్ ప్రభుత్వంలో రివర్సు ఇంజనీరింగ్ పేరుతో గతం కంటే తక్కువ ధరకు టెండర్లు పిలిచే ధోరణిని చేపట్టారు. ప్రజా సొమ్మును ఆదా చేసేందుకు చేపట్టే చర్యల్ని అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో తిరుమలలో భక్తులకు అమ్మే లడ్డూ ధరను రూ.25 నుంచి రూ.50 చేశారు. ధరల విషయంలో రివర్సు టెండరింగ్ చేసినట్లే.. భక్తులకు ఇచ్చే లడ్డూల ధరల విషయంలోనూ అదే తీరును ఎందుకు ప్రదర్శించలేదు? అన్నది ప్రశ్న.
సరే.. భక్తుల నుంచి తీసుకునే మొత్తంతో లడ్డూల్ని మరింత నాణ్యంగా చేయటమే లక్ష్యమైనప్పుడు.. అందులో వాడే ఆవునెయ్యి ధర విషయంలో ఎందుకు కక్కుర్తికి వెళ్లినట్లు? అన్నది ప్రశ్న. తమ పాలనలో అంత చేశాం. ఇంత చేశామని చెప్పే వైసీపీ నేతలు.. తిరుమలలో ఆవునెయ్యి నాణ్యతను తేల్చే మిషనరీని ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఆ ల్యాబ్ ను ఎందుకు నెలకొల్పలేదు? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ.. ఇదేమీ లేకుండా లడ్డూ ధరను డబుల్ చేసి.. ఆవునెయ్యి ధరను మాత్రం తగ్గించేందుకు ప్రదర్శించిన కక్కుర్తి ఈ రోజు ఈ రభసకు కారణమన్న విషయాన్ని వైసీపీ వర్గాలు ఇప్పటికైనా గుర్తిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.