సీఎం చంద్రబాబు తాజాగా జగన్‌పైనా.. వైసీపీ నాయకులపైనా `భూతాలు` అంటూ విరుచుకుపడ్డారు. కీలకమైన మూడు అంశాలను ఆయన ప్రస్తావించారు. ఈ మూడు అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి.. తమ ను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 1) అమరావతి మునిగిపోయిందని వైసీపీ చేస్తున్న ప్రచారం. 2) మెడికల్ కాలేజీ సీట్లను వెనక్కి తిప్పి పంపుతున్నారని జగన్ చేసిన ఆరోపణలు. 3) కృష్ణానదిలో కనిపించిన నాలుగు బోట్ల వ్యవహారం టీడీపీదేనని జగన్ చెప్పడం.
ఈ మూడు విషయాలు వాస్తవానికి పది రోజులుగా రాజకీయంగా దుమారం రేపుతూనే ఉన్నాయి. కృష్ణానదికి కనీ వినీ ఎరుగని రీతిలో వరదలు వచ్చిన విషయం తెలిసిందే. ఏకంగా 11.43 లక్షల క్యూసెక్కుల వరద నీరు రావడంతో కృష్ణమ్మ ఉదృతంగా ప్రవహించింది. అయితే.. ఈ నీటిని దిగువకు వదలకుండా.. చంద్రబాబు తన ఇంటి కోసం తొక్కి పెట్టారని.. దీంతో విజయవాడ మునిగిపోయిందని జగన్ ఆరోపించారు. మరోవైపు.. బ్యాక్ వాటర్ అమరావతిని ముంచేసిందన్నారు. ముంపు ప్రాంతంలోనే ఉందన్నారు.
ఇక, తన హయాంలో తీసుకువచ్చిన మెడికల్ సీట్లను ఇప్పుడు వెనక్కి పంపేస్తున్నారని.. దీనివల్ల పేదల కు, ముఖ్యంగా విద్యార్థులకు కూడా అన్యాయం జరిగినట్టేనని తెలిపారు. ఇక, మూడో అంశం.. ప్రకాశం బ్యారేజీలో కనిపించిన నాలుగు బోట్లు కూడా.. టీడీపీ నాయకులవేనని.. తమపై అనవసరంగా బురద జల్లుతున్నారని కూడా జగన్ ఆరోపించారు. ఇవే విషయాలు జగన్ అనుకూల మీడియాలోనూ పదే పదే ప్రసారం అయ్యాయి. వీటికి అప్పట్లో టీడీపీ మంత్రులు కౌంటర్లు ఇచ్చారు.
తాజాగా వీటిపై స్పందించిన చంద్రబాబు.. వైసీపీ అధినేత సహా ఇతర నేతలను భూతాలతో పోల్చారు. వీరిని భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని లేకపోతే.. నాలుకలకుతాళం వేస్తామని చెప్పారు. తగిన విధంగా బుద్ధి చెప్పి తీరుతామని హెచ్చరించారు. `ఎలా చేయాల్నో అలానే చేస్తాం. కఠినంగా ఉంటాం. ఏం తమాషా చేస్తున్నారా“ అని సీఎం నిప్పులు చెరిగారు. ఈ పరిణామాలతో వైసీపీ రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవనేదిస్పష్టంగా తెలుస్తోంది.