ఏపీ రాజకీయాలలో అందులో ముఖ్యంగా కడప జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు అత్యంత దురదృష్టవంతులు అన్న వాదన నడుస్తున్నది. వారిద్దరూ సుధీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. అందునా అనాదిగా కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ కుటుంబానికి బద్ద విరోధులు. కానీ 2019 ఎన్నికల తర్వాత వారు టీడీపీని వీడి వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు ఎన్నికల తర్వాత ఫలితాలు చూసి ఈ నేతల పట్ల అందరూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి రామసుబ్బారెడ్డి కుటుంబం వ్యతిరేకం. 1983లో టీడీపీ ఏర్పడినప్పటి నుండి 1999 వరకు రామసుబ్బారెడ్డి కుటుంబీకులే ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2004, 2009, 2014లో ఓడిపోయినా 2016లో టీడీపీ పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. అయితే తన మీద గెలిచిన ఆదినారాయణరెడ్డిని టీడీపీలో చేర్చుకోవడంతో ఆయన 2020లో వైసీపీలో చేరారు. తన కుటుంబ చిరకాల ప్రత్యర్ధి అయిన వైఎస్ కుటుంబ పార్టీలో చేరడం ఆశ్చర్యం కలిగించింది.
ఇక పులివెందులలో వైఎస్ కుటుంబం మీద టీడీపీ తరపున నిరంతరం పోటీ చేస్తూ ఉమ్మడి రాష్ట్రంలో సతీష్ రెడ్డి గుర్తింపు పొందాడు. వైఎస్ కుటుంబం, వీరి కుటుంబం చిరకాల ప్రత్యర్ధులు. 2014 ఎన్నికల తర్వాత టీడీపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవి కట్టబెట్టింది. అయితే 2019 ఎన్నికల ఫలితాల తర్వాత అనూహ్యంగా సతీష్ రెడ్డి జగన్ ప్రభుత్వానికి దగ్గరయ్యాడు. ఇటీవల ఎన్నికల ముందు వైసీపీలో చేరిపోయాడు.
రామసుబ్బారెడ్డి, సతీష్ రెడ్డిలు వైసీపీలో చేరడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఈ ఇద్దరు నేతలు టీడీపీని వీడి సెల్ఫ్ గోల్ చేసుకున్నారని, ఈ ఇద్దరూ ఇప్పుడు టీడీపీలోనే ఉండి ఉంటే ఈ రోజు కీలక పదవులు దక్కేవని అంటున్నారు. ఈ నేపథ్యంలో అనుచరుల నుండి మళ్లీ టీడీపీలోకి వెళ్దాం అన్న వత్తిడి కూడా వస్తుందని తెలుస్తుంది.