అదానీ గ్రూపు దందాకు అంతు లేకుండా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రభావితం చేసి ఆదాయ వనరుగా మార్చుకుంటోంది. ఇప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్లలో ఫ్లైయాష్‌ను కూడా అమ్మి సొమ్ము చేసుకుంటోంది. అదానీ ప్లాంట్లలో మాత్రమే కాకుండా ప్రతి ప్లాంటూ అలాగే చేయాలని ఇంధన శాఖతో ఆదేశాలు ఇప్పించింది. దాంతో ఫ్లైయాష్‌తో బ్రిక్స్ తయారు చేసుకునే చిన్న పరిశ్రమలు ఇబ్బందుల్లో పడ్డాయి. మొన్నటివరకు ఆయా పరిశ్రమలకు ఫ్లైయాష్‌ను ఉచితంగా ఇచ్చేవారు. ఎంత కావాలంటే అంత తీసుకెళ్లేందుకు అనుమతి లభించేది.
ఇప్పుడు టెండర్ వేసి, ఎవరు ఎక్కువ రేటు ఇస్తే వారికే సరఫరా చేస్తున్నారు. ఉచితంగా యాష్ లభించినప్పుడు ఒక్కో సిమెంట్ ఇటుకను ప్రాంతాల వారీగా రూ.10 నుంచి రూ.12కు విక్రయించేవారు. ఇప్పుడు యాష్ కొనుగోలుకు టన్నుకు విశాఖపట్నంలో రూ.80 వరకు పెట్టాల్సి వస్తోంది. దీంతో ఇటుక ధర రూ.15 వరకు పెరిగింది. రేటు తక్కువ ఉన్నప్పుడే అమ్మకాలు తక్కువగా ఉండేవి. ఇప్పుడు రేటు పెరగడంతో ఎవరూ కొనడానికి ముందుకు రావడం లేదు.. దాంతో ఒక్క విశాఖ జిల్లాలోనే 200 ఫ్లైయాష్ బ్రిక్ పరిశ్రమలు ఇబ్బందుల్లో పడ్డాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి పరిశ్రమలు 30 వేల వరకు ఉన్నట్టు అంచనా. వారంతా ఉచితంగా ఇచ్చే యాష్‌కు ఇప్పుడు టన్నుకు రూ.50 నుంచి రూ.80 చెల్లిస్తున్నారు. ఇందులో అత్యధికం అదానీ ఖాతాకే వెళ్తోంది.
ఎందుకిలా…?
థర్మల్ పవర్ ప్లాంట్లలో ఫ్లైయాష్ పేరుకుపోవడం వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతున్నందున ప్రతి ప్లాంటు 100 శాతం యాష్‌ను సద్వినియోగం చేయాలని, లేనిపక్షంలో టన్నుకు వేయి రూపాయల చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ 2021 డిసెంబరు 31న ప్రకటన జారీచేసింది. ఈ నేపథ్యంలో ఎవరైనా ఉన్న యాష్‌ను వదిలించుకోవడానికి ఉచితంగా ఇచ్చేస్తారు. లేదంటే దానిపై టన్నుకు వేయి రూపాయలు చొప్పున కట్టాల్సి ఉంది. కానీ దీనిని కూడా అదానీ ఆదాయ వనరుగా మార్చుకుంది. దేశంలో అత్యధికంగా అదానీ సంస్థకే పవర్ ప్లాంట్లు ఉన్నాయి.
గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్.. ఇలా 8 చోట్ల 13,650 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్లు ఉన్నాయి. వీటి ద్వారా ఏడాదికి సుమారు 1.5 కోట్ల టన్నుల ఫ్లైయాష్ వస్తోంది. కోట్ల విలువ చేసే ప్రభుత్వాల ఆస్తులను కారుచౌకకు కొనే అదానీకి.. దీనిని ఉచితంగా ఇవ్వడానికి మనసు ఒప్పలేదు. దాంతో కేంద్ర ఇంధన శాఖను ప్రభావితం చేసి ఓ సలహా ఇప్పించింది.
దేశంలోని ప్రతి థర్మల్ పవర్ ప్లాంటు ఫ్లైయాష్‌ను ఎవరికీ ఉచితంగా ఇవ్వవద్దని, టెండర్ ప్రాసెస్ ద్వారా విక్రయించాలని, అలా చేయగా మిగిలిన యాష్‌ను మాత్రమే ఉచితంగా ఇవ్వాలని ఉత్తర్వులు ఇప్పించింది. దాంతో బ్రిక్ పరిశ్రమలకు ఉచితంగా లభిస్తున్న ఫ్లైయాష్ గత ఏడాది జూన్ నుంచి ఆకస్మికంగా ఆగిపోయింది. టెండర్ వేసుకున్న వారికే ఇస్తామని, ఉచితంగా ఇచ్చేది లేదని పవర్ప్లాంట్లు మొండికేశాయి. వాస్తవానికి ఈ యాష్‌కు అంత డిమాండ్ లేదు. ఎలాగూ బ్రిక్ పరిశ్రమలు దానిపై ఆధారపడి పనిచేస్తున్నాయి కాబట్టి వాటి నుంచి కొంత రాబట్టుకోవచ్చునని అలా చేశారు.
ఎన్జీటీలో ఎదురుదెబ్బ
ఇంధన శాఖ నిర్ణయంపై ఏపీకి చెందిన అమరావతి ఫ్లైయాష్ బ్రిక్ తయారీదారుల అసోసియేషన్ సహా మరికొన్ని అసోసియేషన్లు జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)ని ఆశ్రయించాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఎవరైతే కాలుష్యం సృష్టిస్తారో వారే దాని వ్యయం భరించాలనేది ప్రాథమిక సూత్రమని, అటవీ పర్యావరణ శాఖ కూడా అదే చెబుతోందని తెలిపాయి. ఈ లెక్కన ఫ్లైయాష్ కాలుష్య కారకం కాబట్టి.. దానిని వదిలించుకోవడానికి అయ్యే వ్యయం పవర్ ప్లాంట్లే భరించాలి. దానిని ఉచితంగానే ఇవ్వాలని, డబ్బులు వసూలు చేయకూడదని కోరాయి.
ఇది న్యాయసమ్మతంగా ఉందని భావించిన ఎన్జీటీ… ఇంధన శాఖ సలహాను పాటించాల్సిన అవసరం లేదని, దానిని అబయెన్స్‌లో పెడుతూ ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో అదానీ గిలగిలలాడింది. ఇలా లాభం లేదని ఇంధన శాఖను సుప్రీం కోర్టుకు పంపింది. అక్కడ ఎన్జీటీ ఆదేశంపై స్టే లభించింది. దాంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సంస్థలు ఫ్లైయాష్కు టెండర్లు ఆహ్వానించాయి. అవసరం ఉన్నవారు, పరిశ్రమను మూసుకోలేనివారు టెండర్ ప్రక్రియ ద్వారా టన్ను రూ.50 నుంచి రూ.80 చొప్పున కొంటున్నారు. అయితే అసోసియేషన్లు సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేను తొలగించడానికి కేసులు వేశాయి. వాటిపై విచారణ నడుస్తోంది.
ఏపీలో టన్నుపై రూ.10 ట్యాక్స్
చెత్తపై కూడా పన్నులు వసూలు చేసిన జగన్ ప్రభుత్వం… ఈ ఫ్లైయాష్పై కూడా పన్నులు వసూలు చేస్తోంది. ఏపీ ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ పేరుతో వ్యర్థాలపై పన్ను అంటూ టన్నుకు రూ.10 వసూలు చేస్తోంది.