‘నాలెడ్జ్ ఈజ్ వెల్త్’.. అంటారు. అంటే జ్ఞానమే సంపద అని. ఇప్పుడు నాలెడ్జ్ ఒక్కటే ఉంటే సరిపోదు.. మనం చదువుకున్నదాన్ని ఆచరణలో పెట్టే నైపుణ్యమూ కావాలి. ‘స్కిల్ గెట్స్ మోర్ వెల్త్’ అనేది న్యూనుడి. అందుకే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నైపుణ్యాభివృద్ధిపై ఎక్కువగా దృష్టిసారించారు. అందులో భాగమే నైపుణ్య గణన. ఆ బాధ్యతలను చేపట్టి సమర్థంగా నిర్వహిస్తున్న డాక్టర్ రవి వేమూరు.. రాష్ట్రంలో నిరుద్యోగం, నైపుణ్యాభివృద్ధి, కంపెనీల రాక గురించి అనేక ఆసక్తికరమైన విశేషాలు తెలియజేశారు. అవన్నీ ఆయన మాటల్లోనే..
ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలో యువతను ఎక్కువగా ఆకర్షించింది.. 20 లక్షల ఉద్యోగాల కల్పన. కానీ, ఈ ఆలోచన ఇప్పటిది కాదు. రెండేళ్లుగా దీనిమీద పనిచేస్తూ ఉన్నాం. దాదాపు 150 నుంచి 200 కంపెనీలతో సంప్రదింపులు జరిపాం. ‘ఎందుకొస్తోంది.. ఈ సమస్య’ అన్నది మా ప్రధానమైన ప్రశ్న. విద్యార్థులను అడిగితేనేమో.. ‘మేం చదువుకుంటున్నాం. మాకు డిగ్రీలు వస్తున్నాయి. కానీ మాకు ఉద్యోగాలు రావట్లేదు’ అంటున్నారు. కంపెనీలను అడిగితేనేమో.. ‘మా దగ్గర బోలెడన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
కానీ, మేం తీసుకుందామనుకుంటే.. మాకు తగిన నైపుణ్యాలున్న అభ్యర్థులు దొరకట్లేదు’ అంటున్నాయి. అంటే.. వాళ్లకి ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ మనకి ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నవారూ ఉన్నారు. కానీ, ఈ ఇద్దరికీ మ్యాచింగ్ జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? అనే ప్రశ్నకు పరిష్కారం కనుక్కోమని చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా, మనదేశంలో వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను పరిశీలించాలని రెండేళ్ల క్రితం చెప్పారు.
అయితే, ఆ పని చేయడానికి ముందు.. అసలు మన రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులున్నారు? ఎవరికి ఏయే నైపుణ్యాలున్నాయి? ఏయే నైపుణ్యాలు అవసరం? ఈ విషయం తెలుసుకోవడానికి ముందు నైపుణ్య గణన చేయాలనే నిర్ణయానికి వచ్చాం. అప్పుడు అసలు మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. ఉదాహరణకు.. ఒక ఉద్యోగం ఉందనుకోండి. దాన్ని చేయగలవారు మన రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో కంపెనీకి చెప్పగలగాలి. ఒకవేళ వారికి తమ కంపెనీలో ఉద్యోగం చేయగల నైపుణ్యాలు లేవని ఆ కంపెనీకి చెబితే వారిలో ఆ నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమాన్ని మనం చేపట్టవచ్చు. ఎందుకంటే.. ఉద్యోగాలకు సంబంధించి యాస్పిరేషన్ గ్యాప్ కూడా ఉంది. అంటే.. ఒక కుర్రవాడు తాను ప్రోగ్రామర్ అవ్వాలని అనుకుంటాడు.
కానీ, అతడి నైపుణ్యాలు చూస్తే.. టెక్నికల్ సపోర్ట్ స్థాయిలోనో, టెస్టింగ్ స్థాయిలోనో ఉంటాయి. ఆ విషయాన్ని ఆ పిల్లవాడు ఒప్పుకోలేకపోతున్నాడు. నైపుణ్య గణన ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుని, అతడి నైపుణ్య స్థాయిని పెంచగలిగితే ప్రోగ్రామర్ అవుతాడు.
నిరుద్యోగుల సంఖ్య ఎక్కువే..
నిరుద్యోగం, ఉద్యోగాల కల్పనకు సంబంధించి.. కేంద్ర ప్రభుత్వం ‘లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు’ను లెక్కిస్తుంది. దానిప్రకారం అధికారులు యువతకు ఫోన్ చేసి ‘మీరు పనిచేస్తున్నారా? లేదా’ అని అడుగుతారు. ‘లేదు’ అని మనం సమాధానం ఇస్తే.. ‘మీరు ఉద్యోగం కోసం వెతుకుతున్నారా?’ అని అడుగుతారు. దానికి కూడా ‘లేదు’ అని చెప్తే అప్పుడు వారిని నిరుద్యోగుల కింద లెక్క చేయరు. దీనివల్ల కేంద్ర గణాంకాల ప్రకారం ఏపీలో నిరుద్యోగ రేటు ఎప్పుడూ 15 శాతం దాకానే ఉంటోంది.
అలా కాకుండా.. ‘పని చేయట్లేదు’ అని చెప్పిన ప్రతి ఒక్కరినీ నిరుద్యోగిగా లెక్కిస్తే మన రాష్ట్రంలో 1.3 కోట్ల మంది దాకా నిరుద్యోగులు ఉన్నట్లు తేలుతుంది. ఇంకా లోతుగా వెళ్తే.. పట్టభద్రులైన నిరుద్యోగు ల సంఖ్య (అంటే డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగం లేని వారు) గణాంకాల ప్రకారం 22 లక్షల దాకా ఉంది. అందులో దాదాపు 15 లక్షల మంది అమ్మాయిలే. పనిచేసే వెసులుబాటు వారికి లేకపోవడమే ఇందుకు కారణం. అంతవరకూ దాదాపు కరెక్టే. వాస్తవ లెక్కలకు దగ్గరగానే ఉన్న సంఖ్య అది. కానీ.. డిగ్రీ కన్నా తక్కువ చదువుకున్న, అసలు చదువుకోని నిరుద్యోగుల లెక్కలోనే చాలా తేడా వస్తోంది. వారి సంఖ్య రాష్ట్రంలో కోటికి పైగానే ఉంటుంది. వారంతా చిన్నచిన్న పనులు ఏవో చేసుకుంటుంటారు.
కాబట్టి వారిని నిరుద్యోగుల కేటగిరీలోకి తీసుకోవట్లేదు. కేవలం గ్రాడ్యుయేట్లపైనే దృష్టి సారించి.. ఈ తక్కువ చదువుకున్న, నిరక్షరాస్యులను పట్టించుకోకుండా వదిలేస్తే తలసరి ఆదాయం పెరగడం చాలా కష్టం. చంద్రబాబు ఈ విషయాన్నే గుర్తించి.. ‘మీరు రెండు సెక్షన్లనూ పరిగణనలోకి తీసుకోండి. మనం చదువుకున్నవారి సమస్యనూ తీర్చాలి. తక్కువగా చదివిన, నిరక్షరాస్యులైనవారికి కూడా అవకాశాలు కల్పించాలి’ అని సూచించారు. అలా చేయాలంటే విభిన్న వ్యూహాలను పాటించాల్సి ఉంటుంది.
అందులో భాగంగానే.. చదువుకున్నవారికి ఎందుకు ఉద్యోగాలు రావట్లేదు అనే అంశంపై దృష్టి సారించాం. అప్పుడు మాకో విషయం తెలిసింది. అదేంటంటే.. మన కాలేజీలు ఇచ్చే డిగ్రీలు విశ్వసనీయత కోల్పోయాయి. మన కాలేజీలు చెప్పే చదువులకూ, కంపెనీలు ఆశిస్తున్న నైపుణ్యాలకూ మ్యాచింగ్ జరగట్లేదు. దీంతో కంపెనీలు తమ వద్దకు వచ్చే పట్టభద్రులను తిరస్కరిస్తున్నాయి. మన డిగ్రీలకు కంపెనీలు గౌరవం ఇవ్వట్లేదు. మన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో దీనిపైనే దృష్టి సారించాం.
ఒక అభ్యర్థికి ఉద్యోగం రావాలంటే.. టెక్నికల్ స్కిల్ ఒక్కటే సరిపోదు. కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లెం సాల్వింగ్ స్కిల్స్, ఇతరులతో కలిసి పనిచేసే నైపుణ్యాలు కూడా ఉండాలి. ఇవి చాలా ముఖ్యం. వీటిని పిల్లలకు కాలేజీల్లో ఎక్కడా నేర్పట్లేదు. దీన్ని తదుపరి దశకు ఎలా తీసుకెళ్లాలా అని చాలా ఆలోచించాం. జీమ్యాట్, టోఫెల్ వంటి స్కోర్లను ప్రపంచమంతా నమ్ముతుంది కదా. అలాగే ఉపాధి కల్పనకు సంబంధించి కూడా మంచి మంచి ప్రపంచస్థాయి కోర్సులున్నాయి.
మెరిట్, యామ్క్యాట్, నౌకరీవాళ్ల ‘ఎన్క్యాట్’.. వంటివన్నీ ఈ కోవలోకి వస్తాయి. వాటిలో ఒక స్థాయి స్కోరు వస్తే ఉద్యోగం ఇవ్వడానికి చాలా కంపెనీలు ముందుకు వస్తాయి. ఈనేపథ్యంలో మేం ఒక నిర్ణయం తీసుకున్నాం. ఉద్యోగం కావాలనుకునేవారు మన దగ్గర పేరు నమోదు చేయించుకోగానే వారితో ఈ బేస్లైన్ పరీక్షలు రాయిస్తాం. వాటిలో మంచి మార్కులు.. అంటే 65% కంటే ఎక్కువ వస్తే నేరుగా కంపెనీలకు సిఫారసు చేస్తాం. నిర్ణీత స్థాయి మార్కులు రాకపోతే వారిని శిక్షణకు పంపిస్తాం. ఇది మన ముందున్న చాలెంజ్. రాష్ట్రంలో ఒక్కసారి నైపుణ్యగణన పూర్తయ్యాక.. పిల్లలందరితో ఈ పరీక్ష రాయిస్తాం.
మనోళ్లు సూపరే.. కానీ..
నేను 2015 నుంచి 2019 దాకా ఏపీఎన్నార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను. అప్పుడు చంద్రబాబు నాకు అప్పజెప్పిన బాధ్యత ఏమిటంటే.. 25 లక్షల మంది ఎన్నార్టీల (అంటే తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్లినవారు) ఆదాయం 50 శాతం పెంచడం. అందులో భాగంగా మేం వివిధ దేశాల్లో మనవాళ్లు పనిచేస్తున్న కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడాం. గల్ఫ్లోగానీ, అమెరికాలోగానీ.. అన్ని కంపెనీలూ చెప్పిన మాట ఒక్కటే.
‘‘ఆంధ్రా నుంచి వచ్చినవాళ్లంతా మంచివాళ్లు. తెలివైనవాళ్లు. చక్కగా పనిచేస్తారు. చట్టబద్ధంగా పనిచేస్తారు. ఎప్పుడూ ఎదురు తిరగరు’’ అని అందరూ చెప్పారు. అప్పుడు మేం.. ‘మరి మీ ఫస్ట్ చాయిస్ కేరళ, తర్వాత తమిళనాడు, ఆ తర్వాతే మావాళ్లు ఎందుకు ఉంటున్నారు?’ అని వారిని ప్రశ్నించాం. దానికి వారు.. ‘‘మీవాళ్లు తెచ్చే సర్టిఫికెట్లకు.. వారికి ఉన్న నైపుణ్యాలకు మ్యాచ్ అవట్లేదు. అందుకే మేం వెల్డర్ ఉద్యోగం కోసం వచ్చే తెలుగువారికి వెల్డర్ అసిస్టెంటుగా ఇస్తున్నాం. చాలా మంది ఇక్కడికొచ్చాక పని నేర్చుకుంటున్నారు. నేర్చుకోలేనివాళ్లు వెనక్కి వెళ్లిపోతున్నారు’’ అని చెప్పారు.
అప్పుడు మేం.. ‘వాళ్లకి ఎలా నేర్పుతున్నారు?’ అంటే స్థానికంగా ఉన్న నైపుణ్యాభివృద్ధి ఏజెన్సీల్లో నేర్పిస్తున్నట్టు చెప్పారు. ఆ విషయం చెప్తే చంద్రబాబు మాకో సూచన చేశారు. ఆ ఏజెన్సీలు ఏమి నేర్పుతున్నాయో.. ఆ కరిక్యులంనే మనం ఇక్కడ ఇండియాకు తీసుకొచ్చి మనవాళ్లకి నేర్పుదామన్నారు. అప్పుడు.. విదేశాల్లో ఉద్యోగం కోసం విమానం ఎక్కే ముందే వారికి ఆ నైపుణ్యం ఉంటుంది. తద్వారా అక్కడికెళ్లాక ఇబ్బంది పడరు.
వారికి 20% జీతం కూడా ఎక్కువ వస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే మూడు అంతర్జాతీయ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాం. శిక్షకులను కూడా విదేశాల నుంచే తెప్పించాం. అప్పట్లో మేం 150 మందికి శిక్షణ ఇస్తే 90% పైగా వెంటనే ఉద్యోగాలు పొందారు. ఆ కార్యక్రమం బాగా సక్సెస్ అయ్యింది. కానీ, దురదృష్టవశాత్తూ 2019లో ప్రభుత్వం మారింది. ఆ కార్యక్రమాన్ని ఆపేశారు. ఈ నేపథ్యంలో.. రెండేళ్ల క్రితం మళ్లీ చంద్రబాబుగారు ఈ అంశంపై దృష్టి సారించాలని చెప్పారు.
ఆయన సూచనల మేరకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించాం. ఎన్ఎస్డీసీలో కూడా చూశాం. ప్రధానంగా సమస్య ఎక్కడ ఉందంటే.. ఈ ప్రోగ్రాముల్లో భాగమవుతున్న కంపెనీలు నామ్కేవాస్తేగా ఉంటున్నాయి. కంపెనీలు కరిక్యులం స్థాయిలో కొంచెం చూస్తున్నాయిగానీ.. ఆ తర్వాత పట్టించుకోవట్లేదు. మనం అలా చేయట్లేదు. కంపెనీలనే పిలిపించి.. ‘మీకు ఏ కరిక్యులమ్ కావాలి?’ అని అడిగాం. వారి కరిక్యులమ్తోనే శిక్షణ ఇస్తున్నాం.
ఇందుకోసం రోల్ సిమ్యులేషన్ అనేదాన్ని మొదలుపెట్టాం. అంటే.. ఈ అభ్యర్థి కంపెనీలో ఏ పాత్రలో పనిచేస్తాడో అదే పనిని కంప్యూటర్ ముందు కూర్చుని సిమ్యులేటర్ ద్వారా ప్రాక్టీస్ చేస్తాడు. ఇది అద్భుతంగా పనిచేస్తోంది. భవిష్యత్తులో మనం ఎన్ని రోల్ సిమ్యులేషన్స్ చేస్తే అంతమంచిది. తర్వాతి దశల్లో వీటిని కాలేజీల స్థాయిలోనే ప్రవేశపెట్టచ్చు కూడా. వీటిలో శిక్షణ పొందిన వారికి ఉద్యోగం రావడం చాలా సులభం అవుతుంది.
50వేల మందిపై సర్వే..
యువత నైపుణ్యాలను సానబెట్టడం ఒక ఎత్తు అయితే.. వారికి స్థానికంగా ఉపాధి కల్పించడం మరో సవాల్. దీనికోసం మేం ఎన్నికలకు ముందే 50 వేల మంది నిరుద్యోగులపై సర్వే చేశాం.. ‘మీరు కావాల్సిన ఉద్యోగం, కావాల్సినంత శాలరీ వస్తే ఎక్కడ ఉంటారు?’ అని. ఎందుకంటే, ఇక్కడ చాలా మందికి ఒక దురభిప్రాయం ఉంది. మనవాళ్లు బెంగళూరు, హైదరాబాద్, అమెరికాకు వెళ్తారని. కానీ, మా సర్వేలో 91 శాతం మంది.. తమకు కావాల్సిన ఉద్యోగం వస్తే ఏపీ వదిలి ఎక్కడికీ వెళ్లబోమని చెప్పారు.
అందుకే దానిపై చాలా కసరత్తు చేస్తున్నాం. ఉద్యోగాలు ఇక్కడికి రావాలంటే రెండు అంశాలు ప్రధానం. ఒకటేంటంటే.. నేను ఏపీఎన్నార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా విదేశీ కంపెనీలతో మాట్లాడాను. ‘మీరు ఆంద్రా రావాలంటే.. మేం ఏమేం ఇన్సెంటివ్లు ఇవ్వాలి?’ అని అడిగా. దానికివారు.. ‘మీరు ప్రోత్సాహకాలు ఇస్తే అది తాత్కాలికం. ఆ నెలకో, ఆ సంవత్సరానికో సరిపోతుందంతే. కానీ, మాకు కావాల్సింది నిపుణులైన ఉద్యోగులు.
నైపుణ్యం ఉన్న అభ్యర్థులను తయారుచేసి ఇవ్వగలిగితే.. మేమే అక్కడికి వస్తాం. మాకు ఏ ప్రోత్సాహకాలూ అక్కర్లేదు’ అంటున్నారు. మనం మనదగ్గర బెస్ట్ ట్రెయిన్డ్ వర్క్ ఫోర్స్ ఉందని తెలపగలిగితే ‘బ్రాండ్ ఏపీ’ డెవలప్ అవుతుంది. అప్పుడు కంపెనీలే మనదగ్గరకు వస్తాయి. నిరుద్యోగ సమస్య రూపుమాసిపోతుంది.