ఏపీలోని కూటమి ప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. వీటిలో రెండు కీలక విషయాలపై ప్రధానంగా చర్చించారు. కూటమి ప్రభుత్వ పాలనకు బుధవారంతో 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఈ వంద రోజుల్లో తాము చేసిన పనులు, ఎదురైన సవాళ్లు, వాటిని ఏవిధంగా ఎదుర్కొన్నామన్న విషయాలను ప్రజలకు వివరించనున్నారు. ఈ క్రమంలో 100 రోజుల పాలనపై ఇంటింటి ప్రచారం చేయాలని కేబినెట్ తీర్మానం చేసింది.
అదేవిధంగా వైసీపీ హయాంలో ప్రాణాంతంగా మారిన చీప్లిక్కర్ను పూర్తిగా ఎత్తేయడంతోపాటు నూతనంగా మద్యం విధానం తీసుకురావాలని నిర్ణయించింది. అక్టోబరు 1వ తేదీ నుంచి ఈ నూతన మద్యం విదానాన్ని అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా మంత్రివర్గంతో సీఎం చంద్రబాబు చర్చించారు. అందుబాటులోకి నాణ్యమైన మద్యం బ్రాండ్లు తీసుకురావాలని నిర్ణయించారు. అదేవిధంగా క్వార్టర్ మద్యం బాటిల్ ధర రూ.99గా ఉండాలని నిర్ణయించారు. నాణ్యమైన మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా.. మద్యం వల్ల సంభవించే దుష్పరిణామాలను అరికట్టాలని కేబినెట్ నిర్ణయించింది.
ఇక, భోగాపురం ఎయిర్ పోర్టు పేరును `అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం`గా మార్చేందుకు క్యాబినెట్ నిర్ణయించింది. ఇక, కీలకమైన ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ‘స్టెమీ’ పథకం కింద గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్టు నిర్ణయించింది. ఇక, కేంద్రం నూతన విద్యావిధానంలో తీసుకువచ్చిన ఆధార్ తరహాలో విద్యార్థులకు ‘అపార్’ గుర్తింపు కార్డులు రాష్ట్రంలోనూ ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రాష్ట్ర హోంశాఖలో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు. దీనికి కార్పస్ ఫండ్ గా రూ.10 కోట్లు కేటాయించారు.
అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి డీమ్డ్ హోదా ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా రూ.1000 కోట్లతో రాష్ట్రంలో బిట్స్-పిలానీ విద్యాసంస్థ స్థాపనకు చర్యలు తీసుకునేందుకు కూడా మంత్రి వర్గం ఓకే చెప్పింది. ఇక, ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఇక్కడ చట్టం చేసి కేంద్రానికి సిఫారసు చేయాలని నిర్ణయించింది.
రైతుల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఉన్న కౌలు రైతుల గుర్తింపు కార్డుల నమూనా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. రైతు సంతకం అవసరం లేకుండానే కౌలు కార్డులు జారీ చేయనున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది రైతులకు మేలు చేయనుంది. ఇక, పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు పాత ఏజెన్సీకే(మేఘా) ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.