వైసీపీ పాలనలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట మసకబారిందని తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తిరుమల ప్రసాదం లడ్డు తయారీ మొదలు పంపిణీ వరకు ఎన్నో వివాదాలు జగన్ సర్కార్ ను చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా తిరుమల లడ్డూ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తిరుమల లడ్డూ నాణ్యత, పవిత్రతపై తీవ్ర విమర్శలు వచ్చాయని, దేవుడి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని ఆరోపణలు వచ్చాయని చంద్రబాబు అన్నారు.
లడ్డూ తయారీలో నాసిరకం పదార్థాలు వాడారని, దేవుడి ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి ప్రసాదానికి స్వచ్ఛమైన నెయ్యి వాడాలని చెప్పామని, ప్రస్తుతం దేవుడి ప్రసాదం నాణ్యత పెరిగిందని అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన అవసరముందని అన్నారు. కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టి 100 రోజులైన సందర్భంగా కూటమి ఎమ్మెల్యేలతో భేటీ అయిన సందర్భంగా చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉచిత గ్యాస్ పథకాన్ని ఈ ఏడాది దీపావళి నుంచి ప్రారంభిస్తామని ప్రకటించారు. సంక్షేమ పథకాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో తప్పు చేసిన చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని వార్నింగ్ ఇచ్చారు. భవిష్యత్తులోనూ కూటమిలోని 3 పార్టీల మధ్య సమన్వయం ఇలానే కొనసాగాలని ఆకాంక్షించారు.
వాలంటీర్లకు గత ప్రభుత్వం మూడు నెలల జీతాలు పెండింగ్ లో పెట్టిందని, వాలంటీర్ల పదవీ కాలం ఏడాది క్రితమే పూర్తయిందని అన్నారు. కానీ, వారిని రెన్యువల్ చేయలేదని, పేరోల్స్ లేవని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం చేసిన పనికి వాలంటీర్లు రికార్డుల్లో లేకుండా పోయారని అన్నారు. కాగా, ప్రస్తుతం ఉన్న లక్ష మంది వాలంటీర్లను వేరే సేవలకు వాడుకోవాలని, గ్రామ, వార్డు సచివాలయాలను వేరే ప్రభుత్వం విభాగాల్లో కలపాలని కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.