ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని సంచలన ప్రకటన చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న కేజ్రీవాల్ జైల్లో ఉండి బెయిల్ పై వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ తదుపరి సీఎంగా విద్యాశాఖ మంత్రి అతిషి పేరును కేజ్రీవాల్ ప్రతిపాదించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు అతిషిని ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మంత్రివర్గంలో ఏకైక మహిళా మంత్రిగా అతిషి ఉన్న సంగతి తెలిసిందే. కేజ్రీవాల్, సిసోడియాలు జైల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ వ్యవహారాలతో పాటు పాలనాపరమైన వ్యవహారాలను చూసుకోవడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఇక, తన ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయబోతున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ను ఈ రోజు కలిసి తన రాజీనామా లేఖ సమర్పించనున్నారు.
ఆతిషికి పార్టీ పెట్టినప్పటి నుంచి క్లీన్ ఇమేజ్ ఉండటంతోపాటు కేజ్రీ వాల్, సిసోడియా లకు ఆమె నమ్మిన బంటుగా ఉండటం వంటి కారణాల నేపథ్యంలోనే ఆమెను ముఖ్యమంత్రి పదవి వరించింది. ముఖ్యమంత్రి బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించగల నేత ఆమె అని పార్టీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. అయితే, చాలామంది సీనియర్ నేతలను పక్కకు పెట్టి మరి ఆమెను ముఖ్యమంత్రిని చేయడం కొందరు సీనియర్లకు మింగుడుపడడం లేదు. ప్రస్తుతం ఆతిషి చేతిలో విద్య, వైద్యంతోపాటు 14 మంత్రిత్వ శాఖలున్నాయి.