వినాయక చవితి సందర్భంగా వినాయకుడి విగ్రహాలతో కూడిన మండపాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం పలు రకాల రుసుములు వసూలు చేస్తోందని, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ ఆరోపణలపై హోం మంత్రి అనిత క్లారిటీనిచ్చారు. వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసిన వారి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయొద్దని సీఎం చంద్రబాబు చెప్పారని, ఏ ఒక్కరి దగ్గర రూపాయి కూడా తీసుకోలేదని అనిత మీడియా ముందు చెప్పారు. 20 రోజుల క్రితం తాను మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా వైసీపీ హయాంలో విడుదలైన పాత జీవోను తనకు అధికారులు ఇచ్చారని, తాను ఆ జీవోలోని విషయాలు, రేట్లు మాత్రమే చదివానని క్లారిటీనిచ్చారు. అయితే, ఆ తర్వాత సీఎం చంద్రబాబుగారి దృష్టికి వచ్చిందని, వెంటనే పాత జీవో రద్దు చేయాలని వినాయక చవితి పండుకకు 10 రోజుల ముందే చెప్పారని అన్నారు.
వినాయక మండపాలు ఏర్పాటు చేసేవారి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేశామని గుర్తు చేశారు. అంతేకాకుండా, గతంలో ఎలక్ట్రిసిటీ, పోలీసులు, పంచాయితీ…ఇలా ఐదు రకాల డిపార్ట్ మెంట్ల నుంచి విడివిడిగా అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ, తాజాగా అన్ని అనుమతులు ఒక్క చోటే తీసుకునేలా సింగిల్ విండో విధానాన్ని తెచ్చామని అనిత గుర్తు చేశారు. మైక్ కు, సౌండ్ సిస్టంకు పోలీసులు చార్జ్ చేసే 100 రూపాయలు కూడా తీసుకోవద్దని చంద్రబాబు చెప్పారని, ఎవరి దగ్గర ఎటువంటి చలానాలు, రుసుములు వసూలు చేయడం లేదని అన్నారు. అయినా సరే తమపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వైసీపీ నేతలపై, మాజీ సీఎం జగన్ పో సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. జగన్ హయాంలో ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హిందువుల ఆలయాలపై దాడులు, దేవతలు, దేవుళ్ల విగ్రహాల ధ్వసం, రథాల దహనం వంటివి జరిగాయని గుర్తు చేస్తున్నారు. తిరుమల వెంకన్న ప్రతిష్టను మసకబార్చింది వైసీపీ నేతలు కాదా అని ప్రశ్నిస్తున్నారు. తిరులమలో లడ్డూ, ప్రసాదం రేట్లు పెంచడం, గదుల అద్దె పెంచడం వంటి విషయాలను గుర్తు చేసుకుంటున్నారు. తిరుమలలో అన్యమత ప్రచారంపై ఇప్పటికీ మండిపడుతున్నారు.