పేరును చూస్తేనే ఈ సంస్థ ఏం చేస్తుందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. అమెరికాలోని ‘హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్ ’ అన్న సంస్థ అమెరికన్ హిందువుల తరఫున పని చేస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిందూ మతానికి చెందిన కమలా హారిస్ బరిలో ఉన్నారు. అయితే.. అనూహ్యంగా హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్ సంస్థ మాత్రం తన మద్దతును రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కే ఇస్తోంది.
ఎందుకిలా? అంటే.. దానికి బోలెడన్ని కారణాలు ఉన్నాయని చెప్పాలి. ఈ సంస్థ ఛైర్మన్ కం వ్యవస్థాపకుడు ఉత్సవ్ సందూజా తాజాగా మాట్లాడుతూ.. తాము ట్రంప్ కు ఎందుకు మద్దతు ఇస్తున్న విషయాన్ని వివరంగా చెప్పుకొచ్చారు. ట్రంప్ అధ్యక్షుడైతే అమెరికాతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలు బాగుంటాయన్న ఆయన.. కమలా హారిస్ వల్ల అవి అస్థిరంగా మారతాయని పేర్కొన్నారు. కమలా హారిస్ కానీ అమెరికా అధ్యక్షురాలు అయితే.. భారత్ కు చెందిన అంశాలపై ఆందోళనకర నిర్ణయాల్ని తీసుకునే వీలుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కమల అధ్యక్షురాలైతే భవిష్యత్తులో భారత్ – అమెరికా సంబంధాలు అస్థిరంగా మారతాయని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేసే కీలక రాష్ట్రాలైన పెన్సిల్వేనియా.. జార్జియా.. నార్త్ కరోలినాలో డెమోక్రటిక్ అభ్యర్థి కమలాకు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. దీనికి కారణం లేకపోలేదు. భారత ప్రభుత్వం గురించి.. భారత ప్రజల గురించి కమలా అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని.. ట్రంప్ మాత్రం భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదన్న మాట ప్రచారంలో ఉంది.
ఇప్పటికే ట్రంప్ మీద కమల అధిక్యతలో ఉన్నట్లు పలు రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. ఇండో అమెరికన్లు అధికంగా ఉండే పలు రాష్ట్రాల్లోని ఓటర్లు కమలకు అనుకూలంగా ఉన్నారు. అయితే..కమల అమెరికా అధ్యక్ష పదవిని చేపడితే మనకే నష్టమన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు.. ఆమె చేతికి అధికారం వస్తే.. పలు కీలక పదవుల్లో నియమించే వ్యక్తుల వల్ల ఆసియా – అమెరికా ఓటర్లపై ప్రభావం ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అన్నింటికి మించి ఆసియా – అమెరికా వ్యాపారులు ప్రతికూల ప్రభావాల్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందంటున్నారు.
ట్రంప్ వలస విధానాల్ని పక్కాగా అమలు చేస్తారని.. భారత్ నుంచి రక్షణ.. టెక్నాలజీ సహకారం పెంచుకోవటానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారి చెబుతున్నారు. ట్రంప్ భారత అనుకూలవాది. మోడీతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఛైనాపై భారత్ ఢీ కొనేందుకు వీలుగా అనేక రక్షణ ప్రాజెక్టులకు సహకరించారని చెబుతున్నారు. మొత్తంగా ట్రంప్ కు మద్దతు పలుకుతున్న ఈ సంస్థ ప్రకటన రానున్న రోజుల్లో రాజకీయ పరిణామాలకు కారణంగా మారుతుందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.