వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయవాడను వరద ముంచెత్తిన సంగతి తెలిసిందే. అయితే, అదే సమయానికి ఏపీ సీఎంగా చంద్రబాబు ఉండడంతో ఆయన అనుభవమంతా ఉపయోగించి వరద సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. తద్వారా అపార ప్రాణ నష్టం, ఆస్తినష్టాన్ని నివారించగలిగారు. ఏడు పదుల వయసులో స్వయంగా చంద్రబాబు వరద నీటిలోకి దిగి సహాయక చర్యలను పర్యవేక్షించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. కలెక్టరేట్ నే తన ఇంటిగా మార్చుకున్న చంద్రబాబు..అక్కడే బస చేసి కంటి మీద కునుకు లేకుండా సహాయక చర్యలను మానిటర్ చేశారు.
వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో వినాయక చవితి పండుగను చంద్రబాబు జరుపుకున్నారు. గత వారం రోజులుగా క్షణం తీరిక లేకుండా గడిపిన చంద్రబాబు పండుగ పూట ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన నివాసంలో కాకుండా విజయవాడ కలెక్టరేట్ లో చంద్రబాబు పండుగ జరుపుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గణేశుని పూజలో పాల్గొన్న చంద్రబాబు రాష్ట్రానికి విఘ్నాలు తొలగిపోవాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా వేదపండితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆశీర్వచనం అందించారు. ఈ పూజలో చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు.