ఏపీ లో మందుబాబులకు బిగ్ షాక్ తగలబోతోంది. రేపటి నుంచి రాష్ట్రంలో వైన్ షాపులు బంద్ అవ్వనున్నాయి. ఈ మేరకు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఈ బంద్ కు పిలుపునిచ్చారు. వైకాపా ప్రభుత్వంలో వీరంతా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడ్డారు. కానీ ఇప్పుడు వీరి ఉద్యోగాలు పోయే పరిస్థితి ఏర్పడింది.
తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఇప్పటికే వారంతా సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. అయితే ఇంత వరకు ప్రభాత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో కూటమి సర్కార్ కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పాలసీని తీసుకొస్తోంది.
రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమల్లోకి వస్తే.. 15 వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని.. కేవలం ఉపాధి కోసమే తమ పోరాటమని అంటున్నారు. జగన్ హయాంలో తమకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేదని.. ఇప్పుడు ఉద్యోగాలు పోతే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తమ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలి.. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని మద్యం షాపుల ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు వైన్ షాపులు మూసే ఉంటాయని అంటున్నారు. మరి ఈ అంశంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.