విన్నంతనే వికారం కలిగే ఉదంతం ఒకటి ఫ్రాన్స్ లో వెలుగు చూసింది. ఈ దారుణ ఉదంతంలో బాధితురాలు ధైర్యంగా బయటకు రావటమే కాదు.. బహిరంగంగా విచారణ చేయాలని కోరారు. డ్రగ్స్ ఇచ్చిన భర్త.. భార్యకు తెలీకుండా దాదాపు 92 సార్లు రేప్ చేయించిన వైనం వెలుగు చూసి షాకింగ్ గా మారింది. ఈ ఉదంతానికి చెందిన కేసు విచారణ తాజాగా జరిగింది. బాధితురాలు ధైర్యంగా కోర్టుకు హాజరయ్యారు. విచారణ బహిరంగం జరగాలని కోరుకుంటున్నారు. అసలేం జరిగిందంటే..
వికారమైన నేరానికి పాల్పడిన నిందితుడు ఫ్రాన్స్ లో ప్రభుత్వ రంగ సంస్థలో మాజీ ఉద్యోగి. అతడి పేరు డొమినిక్ పెలికోట్. అతని వయసు 71 ఏళ్లు. భార్య పట్ల కొన్నేళ్ల పాటు అత్యంత పాశవికంగా వ్యవహరించేవారు. రాత్రిళ్లు ఆమె తీసుకునే ఫుడ్ లో ఆమెకు తెలీకుండా డ్రగ్స్ కలిపి తినిపించేవాడు. మత్తులో జారుకున్న తర్వాత ఇంటికి కొందరు వ్యక్తుల్ని రప్పించేవాడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడేలా చేసేవాడు. వాటిని రహస్య కెమెరాల్లో రికార్డు చేసేవాడు.
ఈ ఆరాచకం దాదాపు పదేళ్ల పాటు సాగింది. అయితే.. ఆమెకు ఎలాంటి అనుమానం కలిగేది కాదు. 2011 నుంచి 2020 వరకు జరిగిన ఈ దారుణాల్ని పోలీసులు గుర్తించారు. 2020లో ఒక షాపింగ్ సెంటర్ లో కొందరు మహిళల్ని రహస్యంగా రికార్డు చేస్తున్న వైనాన్ని గుర్తించిన సెక్యూరిటీ గార్డును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా అతడి ఫోన్ ను.. కంప్యూటర్ ను తనిఖీ చేయగా.. వారు షాక్ కు గురయ్యారు.
భార్యకు తెలీకుండా ఆమెపై జరిపిన అక్రత్యాలు బయటకు వచ్చాయి. పరాయి వ్యక్తుల చేత లైంగిక దాడులకు పాల్పడిన వందలాది ఫోటోలు.. వీడియోలను అతడి వద్ద గుర్తించారు. మొత్తం 72 మంది చేత 92 సార్లు లైంగిక దాడి చేయించినట్లు గుర్తించారు. ఇప్పటివరకు 50 మందిని ఐడెంటిఫై చేశారు. దాడికి పాల్పడిన వారి వయసు 26 నుంచి 73 ఏళ్ల వయసు మధ్యలో ఉన్నట్లు తేల్చారు. తాజాగా ఈ కేసు విచారణ కోర్టు ముందుకు వచ్చింది. ఈ కేసుపై విచారణను బహిరంగంగా చేపట్టాలని బాధితురాలు కోర్టును కోరింది.
దశాబ్దం పాటు తనకు తెలీకుండానే తనపై జరిగిన లైంగిక దాడి మీద విచారణను బహిరంగంగా చేపట్టాలని బాధితురాలు కోరారు. ఇలాంటి అంశాలపై మహిళలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు.. ఈ విచారణను బహిరంగంగా చేపట్టాలన్నారు. విచారణ వేళ కోర్టుకు ఆమె తన ముగ్గురు పిల్లలతో కలిసి కోర్టుకు హాజరయ్యారు. ఈ ఉదతం ఫ్రాన్స్ లో సంచలనంగా మారింది. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ పెరుగుతోంది.