క్వీన్, మణికర్ణిక లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్తో ఒక టైంలో బాలీవుడ్లో తిరుగులేని స్థాయిని అందుకుంది కంగనా. అప్పట్లో ఆమెకు సాటి వచ్చే కథానాయికే బాలీవుడ్లో కనిపించలేదు. కానీ సక్సెస్ను తలకెక్కించుకుని.. అనవసర వివాదాల్లో తలదూర్చి, అతిగా మాట్లాడ్డం ద్వారా క్రమంగా తన మీద ప్రేక్షకుల్లో వ్యతిరేకతను పెంచుకుంది కంగన. రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అయితే అయింది కానీ.. కథానాయికగా తన రేంజ్ మాత్రం పడిపోయింది. ఆమె సినిమాలకు కొన్నేళ్ల నుంచి మినిమం ఓపెనింగ్స్ కూడా ఉండట్లేదు. ధకడ్ అనే సినిమా మీద వంద కోట్ల బడ్జెట్ పెడితే వసూళ్లు ఐదు కోట్లు కూడా రాని పరిస్థితి. దీని తర్వాత కంగన నుంచి రావాల్సిన ప్రెస్టీజియస్ మూవీ ‘ఎమర్జన్సీ’ అయితే వాయిదాల మీద వాయిదాలు పడుతూ విడుదలకే నోచుకోవట్లేదు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో ఇందిరాగాంధీ పాత్రను పోషించడమే కాక.. స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించింది కంగనా. ఐతే బీజేపీ వాళ్లు కొన్నేళ్ల నుంచి తెర వెనుక ఉండి తీయిస్తున్న ప్రాపగండా సినిమాల్లో ఒకటిగా దీన్ని ప్రేక్షకులు భావిస్తుండడం.. కంగనా మీద పెరిగిన వ్యతిరేకత వల్ల మినిమం బజ్ క్రియేట్ కాలేదు ఈ మూవీ మీద. దీనికి తోడు వివాదాలు కూడా ఈ చిత్రాన్ని వెంటాడుతున్నాయి.
ఇందిరా గాంధీని బ్యాడ్ లైట్లో చూపించేలా ఉన్న ఈ సినిమాను కాంగ్రెస్ వాళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని కూడా చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సెప్టెంబరు 6న ‘ఎమర్జెన్సీ’ని రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ప్రమోషన్లు లేవు. మరోవైపేమో సెన్సార్ బోర్డు ఈ సినిమాపై అభ్యంతరాలు లేవనెత్తిందని.. సర్టిఫికెట్ ఇవ్వట్లేదని అంటున్నారు. దీంతో ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం.. మరోసారి పోస్ట్ పోన్ కాబోతోందని స్పష్టమైంది. మరి ఎప్పటికి ఈ చిత్రానికి మోక్షం లభిస్తుందో?