బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయవాడ చరిత్రలో మునుపేన్నడు లేని విధంగా భారీ స్థాయిలో వర్షపాతం నమోదయింది. మొగల్రాజపురంతోపాటు మరికొన్ని ప్రాంతాలలో కొండ చరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారు. ఈ క్రమంలోనే ఆ ఘటనలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియాను ఆయన ప్రకటించారు.
కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చంద్రబాబు ఆదేశించారు. బెజవాడ నగరంలోని లోతట్టు ప్రాంతాలతో పాటు బస్టాండ్ ప్రాంతం జలమయం కావడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విజయవాడలో పరిస్థితిని హోం మంత్రి అనిత పర్యవేక్షిస్తున్నారు. బెజవాడలో వందలాది ఇళ్లు, వాహనాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.
మరోవైపు, గుంటూరు-విజయవాడ రహదారిలో ఉన్న కాజా టోల్ ప్లాజా దగ్గర భారీగా వరద నీరు చేరడంతో అక్కడ వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే వాహనాల నుంచి టోల్ వసూలు చేయకుండానే అక్కడ సిబ్బంది పంపించి వేస్తున్నారు. అలా చేసినా సరే టోల్ ప్లాజా వద్ద భారీ సంఖ్యలో వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో, అత్యవసరమైతే తప్ప కాజా వైపు రావొద్దని, ఇళ్ల నుంచి బయటికి రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.