ఏపీలో ఎన్నికలు ముగిసాక వైసీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. కీలక నేతలంతా ఒక్కొక్కరిగా వైసీపీకి గుడ్ బై చెప్పేసి.. కూటమి పార్టీల్లో చేరిపోతున్నారు. తాజాగా వైసీపీకి మరో బిగ్ షాక్ తగలబోతోంది. జగన్ కు నమ్మిన బంట్లుగా ఉన్న ఇద్దరు రాజ్యసభ సభ్యులు నేడు పార్టీకి రాజీనామా చేయబోతున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎంపీలు మరెవరో కాదు జగన్ కు కుడి భుజంలా వ్యవహరించిన మోపిదేవి వెంకట రమణ ఒకరు కాగా.. మరొకరు బీద మస్తాన్ రావు.
ఈ రోజు రాజ్యసభ సభ్యత్వానికి ఇద్దరు ఎంపీలు రాజీనామా లేఖలు సమర్పించబోతున్నారు. ఇందులో భాగంగా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ అపాయింట్మెంట్ తీసుకున్న మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు.. బుధవారం రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. అటు పదవికి, ఇటు పార్టీకి ఏకకాలంలో వీరిద్దరూ రాజీనామా చేయబోతున్నారు.
ఇక సెప్టెంబర్ 5, 6 తేదీల్లో మంత్రి నారా లోకేష్ సమక్షంలో మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు టీడీపీలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, వీరితో పాటు త్వరలోనే మరికొంత నాయకులు వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ జాబితాలో పిల్లి సుభాష్ చంద్రబోస్, గొల్ల బాబూరావు, అయోధ్యరామిరెడ్డి, ఆర్.కృష్ణయ్య, మేడా రఘునాథరెడ్డి వంటి వారు ఉన్నారు.