బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణ నేపథ్యంలో కొద్ది నెలల క్రితం ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆమె తీహార్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఆ తర్వాత కవిత పలుమార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆమెకు ఊరట లభించలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కవిత బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్లతో కూడిన బెంచ్ విచారణ జరిపింది.
కవిత తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్ గీ వాదనలు వినిపించారు. మరో నిందితుడు, ఆప్ మాజీ మంత్రి మనీష్ సిసోడియాకు ఆల్రెడీ బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిసోడియాకు ఇచ్చిన బెయిల్ షరతులు కవితకు కూడా వర్తిస్తాయని ముకుల్ రోహత్గీ తెలిపారు. కవిత ఫోన్లలోని డేటా ఉద్దేశపూర్వకంగా ఫార్మాట్ చేశారని ఈడీ తరఫు న్యాయవాది వాదించారు. విచారణకు కవిత సహకరించడం లేదని ఆరోపించారు.
సాక్షులను బెదిరించినట్లు ఎక్కడా కేసు నమోదు కాలేదని ముకుల్ రోహత్గీ వాదించారు. ఈ రోజు సాయంత్రం లోపు కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది. ఈ క్రమంలోనే కేటీఆర్,హరీష్ రావు, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ చేరుకున్నారు.